ఎస్‌బీఐ పేరిట నకిలీ బ్యాంకు బ్రాంచ్‌

నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఆయిల్, నకిలీ ఆహార పదర్థాలు, నకిలీ స్టాంపులు.. ఒక వస్తువు బదులు అచ్చం ఇలాగే ఉండే నకిలీలు తయారు చేసి ప్రజలను మోసం చేసిన వాళ్లను ఇప్పటి వరకు చూశాం. కానీ దేశంలోనే మొదటి సారి ఓ నకిలీ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. తమిళనాడులో ఓ యువకుడు మరో ఇద్దరితో కలిసి ఏకంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పేరిట నకిలీ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాడు.

తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రూటి గ్రామానికి చెందిన కమల్‌బాబు ఓ నిరుద్యోగి. అతని తల్లిదండ్రులు బ్యాంకు మాజీ ఉద్యోగులు. సాధారణంగా తల్లిదండ్రులు మాదిరిగానే వారసులు వారి బాటలో పయనించాలని కష్టపడి చదువుతుంటారు. అయితే కమల్‌బాబు.. తన తల్లిదండ్రుల్లా బ్యాంకు ఉద్యోగం చేయడం ఏమిటి అని అనుకున్నాడో ఏమో గానీ ఏకంగా బ్యాంకు బ్రాంచి ప్రారంభించాడు. మరో ఇద్దరి సహాకారంతో విజయవంతంగా బ్యాంకు ప్రారంభించాడు.

రబ్బర్‌ స్టాంప్‌ తయారీదారుడు మణిక్కం, ప్రింటింగ్‌ ప్రెస్‌ ఓనర్‌ కుమార్‌లతో కలసి బ్యాంకు బ్రాంచి ఏర్పాటు ప్రయత్నాలను ప్రారంభించాడు. అనుకున్నట్లుగానే బ్యాంకు పేరుతో రబ్బరు స్టాంపులు, బ్యాంకు చలాన్లు సృష్టించారు. అయితే ఆ బ్రాంచి ఏర్పాటుపై అనుమానం వచ్చిన ఎస్‌బీఐ జోనల్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి కథ కంచికి చేరింది. పోలీసులు కమల్‌బాబు గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఆదిలోనే వారి ఆటకు ఎండ్‌ కార్డు పడడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Show comments