Rayalaseema Hakkula Vedika, Three Capitals – ఆవేదనను, ఆకాంక్షను చాటిన రాయలసీమ హక్కుల సభ

దశాబ్ధాల తరబడి రాయలసీమవాసులు తమ ప్రాంత వెనుకబాటుతనాన్ని వివిధ వేదికలపై ఏకరువు పెడుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అయినా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. విభజన చట్టం ద్వారా ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ ను అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైతే.. దాన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు గత పాలకులు.ఇలా అనేక అంశాలలో రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరిగింది. 1956 నుంచి రాయలసీమ ప్రాంత ప్రజలు రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తూనే ఉన్నారు. కోస్తా ప్రాంతానికి అత్యధిక మేలు జరిగే శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ భూములు త్యాగం చేశారు.

దశాబ్ధాలు గడుస్తున్నా.. ఇప్పటికీ రాయలసీమ ప్రజలు బతుకుదెరువు కోసం వలస పోతూనే ఉన్నారు. ఇదే పరిస్థితి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలది కూడా. ఈ పరిస్థితిని మార్చేందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానులకు స్వీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఒక జిల్లా, ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా తెచ్చిన మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని, అప్పుడే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఈ రోజు తిరుపతిలో జరిగిన రాయలసీమ హక్కుల వేదిక సభలో వక్తలు నినదించారు. 

Also Read : మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆవేదన, ఆకాంక్ష ఈ సభ ద్వారా మరోమారు వెల్లడైంది. ఒకే రాజధాని, అదీ అమరావతి మాత్రమే ఉండాలనుకోవడం అన్యాయమని, మూడు రాజధానుల ఏర్పాటుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని వక్తలు డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కరువు పరిస్థితులు, ఉపాధి లేమి, సాగునీటి కొరత. వలసలను వక్తలు ఈ సభలో ఆవిష్కరించారు. రాయలసీమ మేథావుల ఫోరం అధ్యక్షుడు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో.. వివిధ సంఘాల నేతలు, న్యాయవాదులు, రచయితలు భూమన్, చంద్రశేఖర్‌ రెడ్డి, రవి వర్మ, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ, శ్రీకంఠ, శివారెడ్డి, సురేష్, రాబర్ట్‌ తదితరులు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు.

అమరావతియే ఏకైక రాజధాని అంటే.. మరోసారి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అన్యాయం చేసినట్లేనని వక్తలు స్పష్టం చేశారు. అభివృద్ధి కేంద్రీకరణ వల్ల ఎలాంటి నష్టం జరిగిందో రాష్ట్ర విభజన సమయంలో చూశామని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని జిల్లాలకు అభివృద్ధిని విస్తరించడమేనన్నారు. అది మూడు రాజధానులతోనే సాధ్యమని నొక్కివక్కాణించారు. రాష్ట్ర విభజన సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత జిల్లాల అభివృద్ధి గురించి చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా గత పాలకులు మళ్లించారని వక్తలు గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలు మంచిది కాదని, అది సమాజానికి తీరని నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు.

Also Read : మూడు రాజధానులకు మద్ధతుగా మంత్రి సీదిరి శంఖారావం

ముగ్గురు కుమారుల్లో ఒకరికి ఆస్తి అంతా ఇచ్చి.. ముగ్గురు అభివృద్ధి చెందాలని కోరుకుంటే అది సాధ్యమవుతుందా..? అని అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలి, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ కొత్త నినాదం ఎత్తుకున్న వారిని వక్తలు సూటిగా ప్రశ్నించారు.

మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని వక్తలు బలంగా విశ్వసించారు. సమగ్రాభివృద్ధి అంటే.. అందులో అమరావతి కూడా ఉంటుందన్న విషయం అందరూ గుర్తించాలన్నారు. ఉత్తరాంధ్ర, సీమ ప్రాంతాల అభివృద్ధి కోసం రాయలసీమ వాసులు పెద్దన్న పాత్ర పోషించాలని ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వివిధ సంఘాల నేతలు అభిలషించారు. ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు కలసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏదో ఒక్క ప్రాంతం కాదని, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ఈ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో నష్టపోయిన రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు మళ్లీ నష్టపోయేందుకు సిద్ధంగాలేరని వక్తలు విస్పష్టంగా చాటి చెప్పారు. వక్తలు మాట్లాడుతున్న సమయంలో మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున జై రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ.. మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read : ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పదం కాదు.. భూములు కొల్లగొట్టారా..? లేదా..?

Show comments