కరాచీలో ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..ఏమైందంటే?

ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో సోమవారం పెనుప్రమాదం తప్పింది. ఫ్లైట్ వెళుతున్న సమయంలో, ఈ విమానం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత దానిని పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండగా, అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడామని ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. అందుతున్న సమాచారం మేరకు ఖతార్ ఎయిర్‌వేస్ యొక్క QR579 విమానం ఢిల్లీ నుంచి దోహా కు బయలుదేరింది. ఈ క్రమంలో విమానంలోని కార్గో హోల్డ్‌ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది.

దాన్ని గమనించిన విమాన సిబ్బంది విమానాన్ని దగ్గరలో ఉన్న పాకిస్థాన్‌కు మళ్లించి కరాచీలోని ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానానికి అసలు ఏం జరిగింది అనే అంశంమీద విచారణ జరుపుతున్నామని ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రయాణికులను మరో విమానంలో పంపనున్నారు. విమానాన్ని తనిఖీ చేస్తున్నామని, అలాగే ప్రయాణికులను మరో విమానంలో దోహాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిర్‌వేస్ తెలిపింది.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌వేస్ క్షమాపణలు చెప్పింది. అయితే భారత్ కు శత్రువుగా భావించే పాకిస్తాన్ కు భారత నుంచి వెళుతున్న విమానాన్ని తీసుకువెళ్లడం మీద తొలుత ఆందోళన చెలరేగినా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. గతంలో ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను భారత్ తీసుకువస్తున్న సమయంలో కూడా భారత విమానాలకు తమ ఎయిర్ రూట్ వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Show comments