వాజపేయికి పీవీ చెప్పిన రహస్యమేంటి?

  • Published - 07:27 AM, Thu - 26 December 19
వాజపేయికి పీవీ  చెప్పిన రహస్యమేంటి?

దేశంలో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారత మార్కెట్లను సరళీకృతం చెయ్యడం ద్వారా దేశ ఆర్ధికరంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడానికి కారణం అయిన పీవి నర్సింహారావు వంటి వారు మనదేశానికి ప్రధానిగా చెయ్యడం నిజంగా మన అదృష్టం. అదేవిధంగా అటల్ బిహారీ వాజపేయి గారు ప్రధాన మంత్రిగా తన హాయం లో టెలికాం విప్లవం, హైవే విప్లవం మరియు అణు కార్యక్రమాలతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించిన ప్రధానిగా చెప్పొచ్చు. అయితే ఈ మాజీ ప్రధానులిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంఘటన ఒకటి తర్వాతి కాలంలో వెలుగులోకి రావడం జరిగింది.

ఇందిరాగాంధీ, వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో దేశం అణు విప్లవం పట్ల ఆసక్తి చూపింది. పీవి నర్సింహారావు హయాంలో కుడా అణుకార్యక్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, అణ్వస్త్రాల అభివృద్ది అంశంలో ఆయనకు సొంత పార్టీ నుండే సరైన సహకారం లభించలేదు.

1996 సార్వత్రి ఎన్నికల అనంతరం అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ వాజపేయిని ప్రధానిగా నియమించి, సభలో తన మెజారిటీని నిరూపించమని కోరారు. పార్లమెంట్ లో విశ్వాస పరీక్షకు ముందు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార సమయంలో పీవి నర్సింహారావు వాజపేయికి ఒక రహస్య చిట్టి పంపించారట. ఆ చీటీ లో “అంతా సిద్ధంగా ఉంది,స్విచ్చ్ నొక్కటమే తరువాయి ” అని రాసి ఉంది. అది పోఖ్రాన్ వద్ద అణు పరిక్ష కు సంబంధించిన అంశమని తరువాతి కాలంలో కొందరు అధికారులు తమ పుస్తకాలలో రాశారు. కానీ వాజపేయి అణు కార్యక్రమాన్ని చేపట్టడానికన్నా ముందే పార్లమెంట్ లో విశ్వాస పరీక్షలో ఓడిపోయి 13 రోజులకే పదవి నుండి దిగిపొవాల్సి వచ్చింది

నిజం చెప్పాలంటే పీవి నరసింహరావు స్వయంగా ప్రధానిగా ఉన్నసమయంలో వ్యూహాత్మకంగా భారత్ అణు పరీక్షలు జారపటానికి అంతా సిద్దమయినా ఎన్నికలు హడావుడి మరో వైపు అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో ఎన్నికల అనంతరం అణుపరీక్షలు జరపాలనుకున్నారు. దానికి కారణం ఎన్నికల అనంతరం తిరిగి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పీవీ గట్టిగా నమ్మడమే.

ఇటీవల అమెరికా దేశానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ (ఎన్ఎస్ఏ) మరియు న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఇంటర్నేషనల్ హిస్టరీ ప్రాజెక్ట్ (ఎన్‌పిఐహెచ్‌పి) విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాల ప్రకారం, పీవి హయాంలో ఇండియా ఎక్కడ అణు పరీక్షలు చేస్తుందోనన్న అనుమానంతో వాషింగ్టన్ పొఖ్రాన్ పరీక్షా స్థలంపై నిశితంగా నిఘా పెట్టి, ఆ అణుపరీక్షను ఆపడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసి సఫలం అయ్యింది.

ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఈ రహస్య పత్రాల సారాంశం ప్రకారం ఇండియా 1995 చివరిలో తిరిగి తన అణు ప్రయోగ సన్నాహాలు మొదలుపెట్టడంతో పోఖ్రాన్ వద్ద యుఎస్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ చాలా తీవ్రంగా ఉండేదని 1995 చివర్లో భారతదేశం అణు పరీక్షను ప్లాన్ చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేసిన తరువాత అప్పటి అమెరికా రాయబారి విస్నర్ భారత ప్రధాని కార్యాలయాన్ని హెచ్చరించారని తెలిసింది.

ఇండియాలో అమెరికా రాయబారిగా ఉన్న విస్నర్ ప్రధాని పీవీ ప్రధాన కార్యదర్శి ఎఎన్ వర్మను కలుసుకొని పొఖ్రాన్ లో పీవి నరసింహారావు ప్రభుత్వం అణు పరిక్ష చెయ్యాలనుకుంటున్న పరీక్షా స్థలం యొక్క ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని చూపిస్తూ, ఒకవేళ ఇండియా మమ్మల్ని లెక్క చేయకుండా అణు పరిక్ష విషయంలో మొండిగా ముందుకు వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఆ తర్వాత కొంత కాలానికి డిసెంబర్ లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రధాని పీవి నరసింహారావుకి ఫోన్ చేసి అణు పరీక్ష అంశంలో ముందుకు వెళ్లొద్దంటూ ప్రధానికి సూచించడంతో ఆ అంశంలో భారత్ ‘బాధ్యతాయుతంగా’ వ్యవహరిస్తుందని ప్రధాని క్లింటన్ కి హామీ ఇచ్చారు

అప్పట్లో ప్రచ్ఛన్న యుద్ధంకాలం నాటి రాజకీయ పరిస్థితులు, అంతర్జాతియ పరిణామాలు విదేశాంగ సంబంధాలు దృష్యా, భారతదేశం ఒక శక్తివంతమైన వ్యక్తిని ప్రధానిగా కలిగి ఉండడం అమెరికాకు ఇష్టం ఉండేది కాదనేది బహిరంగ రహస్యమే, కానీ పీవీ తదనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో వాజపేయి ప్రధాని కావడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అణ్వస్త్ర అభివృద్ధి కార్యక్రమాల్లో వాజపేయి నేతృత్వంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వేంగంగా ముందుకెళుతుందేమోనన్న అనుమానం అమెరికాకి వుంది. దాంతో వాజ్‌పేయి భారత ప్రధాని కావడం పట్ల అమెరికా కొంత ఆందోళన చెందింది.

ఇండియాలో అప్పటి అమెరికా రాయబారి ఫ్రాంక్ విస్నర్ కి మరియు వాషింగ్టన్ కి మధ్య జరిగిన సంభాషణలు ద్వారా వాజపేయిని తదుపరి భారత ప్రధానమంత్రి కావడం అమెరికాకు ఏ మాత్రం ఇష్టం లేదని అర్ధమౌతుంది. దానికి ప్రధాన కారణం కాబోయే ప్రధాని వాజపేయి తీరు చూస్తుంటే అతను అణు పరీక్షకు అనుకూలంగా ఉంటాడనే ప్రాధమిక అంచనాకి అమెరికా వచ్చింది.

అణు పరీక్ష జరపకుండా భారత్‌ను ఆపడానికి అమెరికా జపాన్ ని కూడా ఉపయోగించుకుందని ఈ లేఖల్లో వెల్లడైంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోవడంతో 1998 మధ్యంతర ఎన్నికల తరువాత వాజపేయి తిరిగి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి రావడంతోనే పోఖ్రాన్‌లో అణు పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.

1999 ఎన్నికల్లో మంచి విజయం సాధించిన వాజపేయి నేతృత్వంలోని NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈసారి ఎలాగైనా అణు ప్రయోగం నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న వాజపేయి ఈసారి ఈ ప్రయోగం తాలూకు సన్నాహాలను చాలా గోప్యంగా ఉంచుతూ అమెరికా ఇంటిలెజిన్స్ కు తెలియకుండా చాలా జాగ్రత్త పాడ్డాడు. పివి హాయంలో 1995 అనుభవం నుండి పాఠాలు నేర్చుకున్నవాజ్‌పేయి తన మిత్రుడు జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా ఇచ్చిన కఠినమైన సూచనల మేరకు పోఖ్రాన్ వద్ద అణు కార్యకలాపాలను సంబంధిచిన విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దీనితో ఇండియా అణు పరీక్షలకు సన్నద్ధమైన విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్సీ వర్గాలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. ఇండియా అణు పరీక్ష సన్నాహాలను ముందస్తుగా గుర్తించలేకపోయామని యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా ఈ పత్రాల్లో అంగీకరించింది. తమకు ఉపగ్రహ చిత్రాలు ముందస్తు హెచ్చరికను అందించినా మేము ఆ సమాచారాన్ని సరైన సమయానికి విశ్లేషించలేకపోయామని అది తమ నిఘా వైఫల్యమెనని అమెరికా అంగీకరించింది.

అందువల్లనే వాజపేయి ప్రభుత్వం ప్రపంచ దేశాలనుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడమే కాక దేశంలోని అంతర్గత ఒత్తిడిని కూడా తట్టుకుని పోఖ్రాన్ అణు ప్రయోగాన్ని విజయవంతం చెయ్యగలిగింది. దానితో ప్రపంచ దేశాలకు మన దేశ అణు సామర్ధ్యం మీద ఉన్న అంచనాలన్నీ ఒక్క ప్రయోగం తో పటాపంచలయ్యాయి. భారతదేశం కూడా అణ్వస్త్ర దేశంగా అగ్ర దేశాల సరసన నిలబడింది.

ఈ విధంగా అణు పరీక్షకి ప్రణాళిక అంతా సిద్ధం చేసినప్పటికీ.. చివరి నిమిషంలో సమాచారం బయటకి రావడంతో అమెరికా ఒత్తిడి వల్ల అణు పరీక్షని విరమించుకున్న పీవి నరసింహారావు రాజకీయాలని, వ్యక్తిగత విభేదాలని పక్కనపెట్టి తన తదుపరి ప్రధాని వాజపేయి ప్రమాణ స్వీకారం రోజున “నేను చేపట్టిన అసంపూర్ణమైన పనిని నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది'” అన్న ఒక వాక్యంతో ఒక చిన్న చీటీ ముక్క ద్వారా పోఖ్రాన్ అణు పరిక్షకి అంతా సిద్ధంగా ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ అణు పరీక్షా విషయమ లో వెనక్కి తగ్గొద్దని సూచించడం నిజంగా గొప్ప విషయం.

ఏదేమైనా ఈ చిన్న చీటీ ముక్క వెనుక ఇంత అంతరార్ధం దాగుందంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు.

Show comments