Idream media
Idream media
కరోనాకాలం ప్రధాని మోడీకి పెద్దగా కలిసి రాలేదు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా, త్వరితగతిన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చినా ప్రణాళికా లోపాలు ఇరకాటంలో పెట్టేశాయి. బీజేపీయేతర ప్రభుత్వాలపై వివక్ష చూపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకేనేమో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కొన్ని రాష్ర్టాలలో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో సరైన చర్యలు చేపట్టకపోతే.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుంది.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కాస్త ముందుగానే స్పందిస్తోంది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఎయిర్‌పోర్టులలో పరీక్షల సంఖ్యను పెంచింది. అలాగే వ్యాక్యినేషన్ పై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మూడో తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు చెందిన సీనియర్ సాంక్రమిక వ్యాధి నిపుణుడు డాక్టర్ సంజయ్ కె.రాయ్ విభేదిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనమూ ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండానే పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలనే నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించడం తనను నిరాశపర్చిందన్నారు.
ప్రధాని మోడీ అభిమానుల్లో ఒకడినైనా తాను.. ఈ నిర్ణయంతో విభేదించాల్సి వస్తున్నందుకు బాధగా ఉందంటూనే.. కొవ్యాక్సిన్ టీకా ప్రయోగ పరీక్షల ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గానూ వ్యవహరించిన సంజయ్ కె.రాయ్ ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. దానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ట్వీట్టర్ ఖాతాను కూడా ట్యాగ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు.. ఇప్పటికే పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడం, ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గించడం, కొవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేయడం.. వీటిలో కనీసం ఏదో ఒక నిర్దిష్ట లక్ష్యంతో పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నారనే స్పష్టతను ఇస్తే బాగుండేదన్నారు. కె.రాయ్ ట్వీట్ మూడోదశలో కూడా మోడీ ప్రభుత్వంపై విమర్శలు తప్పేలా లేవనే సంకేతాలు ఇస్తోంది.