Idream media
Idream media
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు నెలల తరబడి ఏపీలో ఉద్యమం కొనసాగుతోంది. కార్మికులు ఢిల్లీ స్థాయిలో తమ నిరసనను తెలిపారు. కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడని జనసేనాని ఇటీవల విశాఖలో ఒక్క రోజు దీక్ష చేశారు. లేటెస్ట్ గా మంగళగిరి వద్ద కూడా దీక్ష చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఈ మూడు రోజులలో వీలైనంత ఎక్కువగా సామాజిక మాధ్యమాలను ఇతర సాధనాలను వాడుకుంటూ ఏపీ సర్కార్ ఉదాశీనతని ఎండగట్టేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఆయన వివిధ రూపాల్లో చేస్తున్న అన్ని పోరాటాల్లోనూ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటుండటమే విమర్శలకు తావిస్తోంది.
ఏదేనీ అంశం రాష్ట్ర పరిధిలో లేకపోయినా.. రాష్ట్ర రాజకీయాలనే వేడిపుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి విపక్షాలు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. ఇలా పలు అంశాలపై నిలదీయాల్సింది, ప్రశ్నించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ, రాజకీయ ప్రయోజనాలను ఆశించి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే సాహసం చేయడం లేదు. ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం సంగతి కాసేపు అటుంచితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాన్నాళ్ల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఆందోళన వ్యక్తం చేయడం బాగానే ఉన్నా.. ఇక్కడ కూడా తన పొలిటికల్ ప్లాన్ అమలుచేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర అది ఏర్పాటు అయిన విధానం దాని స్పూర్తి వెనక ఉన్న అమరుల త్యాగాలు,వేలాది ఎకరాలు ఇచ్చిన రైతుల ఉదారత అన్నీ కూడా కేంద్రానికి తెలియచేయాల్సిన బాధ్యత నైతికత ముఖ్యమంత్రి జగన్ మీదనే ఉంది అని పవన్ అంటున్నారు. ఈ విషయంలో మాకే బాధ్యత లేదు అని తప్పించుకుంటే కుదరదు అంటున్నారు పవన్. దీనిపై వైసీపీ వర్గాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. ప్లాంట్ చరిత్రను చెప్పడమే కాదు.. నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయవచ్చో కూడా జగన్ కేంద్రానికి వివరించిన తీరు, దానిపై ప్రముఖులు, మేధావులు సైతం ప్రశంసించిన తీరు పవన్ కు కనిపించకపోవడం విచారకరమని అంటున్నాయి.
Also Read : జగన్ సూచనలు పాటిస్తే విశాఖ ఉక్కు సేఫ్ – హైకోర్టుకు జేడీ లక్ష్మీనారాయణ అఫిడవిట్
స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ వైసీపీ ఎంపీలు ప్రతీ సమావేశంలోనూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనే కాకుండా, కేంద్రం పెద్దలను వ్యక్తిగతంగా కూడా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఢిల్లీలో కార్మికులు నిర్వహించిన ధర్నాలలో కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ.. వైసీపీ ఎంపీలు ప్లాంట్ కు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేయరని పవన్ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించాల్సిన వారిని, ప్రశ్నించాల్సిన అంశాలపై ప్రశ్నించకుండా..
కార్మికులకు మద్దతుగా పోరాడుతున్న వారినే ప్రశ్నించడం ఎంత వరకు సబబో పవన్ కే తెలియాలని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. కనీసం డిజిటల్ క్యాంపెయిన్ లో అయినా.. జనసేన తీరు మారుతుందో, లేదో చూడాలి.