నాడు డెలివరీ బాయ్.. నేడు నెదర్లాండ్స్ జట్టులో స్టార్ ప్లేయర్ గా..

  • Author Soma Sekhar Published - 11:32 AM, Thu - 19 October 23
  • Author Soma Sekhar Published - 11:32 AM, Thu - 19 October 23
నాడు డెలివరీ బాయ్.. నేడు నెదర్లాండ్స్ జట్టులో స్టార్ ప్లేయర్ గా..

కృషి, పట్టుదల, కష్టపడే తత్వం ఈ మూడు ఉంటే.. లోకంలో మనిషి సాధించలేనివి ఏవీ లేవు. ఈ విషయాన్ని ఎంతో మంది ఇప్పటికే రుజువు చేశారు కూడా. ఇక కొంతమంది రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా మారారు అని చాలా మంది అనుకుంటారు. కానీ వారి విజయం వెనక ఎన్నో సంవత్సరాల కష్టం దాగుందని వారు చెబితేగానీ తెలీదు. తాజాగా అలాంటి కష్టమే తన జీవితంలో కూడా ఉందని నెదర్లాండ్స్ క్రికెటర్ చేసిన పాత ట్వీట్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నాడు ఫుడ్ డెలివరీ బాయ్ గా చేసిన నెదర్లాండ్స్ స్టార్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్.. నేడు వరల్డ్ కప్ లో డచ్ టీమ్ కు కీలకంగా మారాడు. మరి అతడి స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల్ వాన్ మీకెరెన్.. రాత్రికి రాత్రే హీరో అయిన నెదర్లాండ్స్ ఆటగాడు. అయితే ఈ విజయం వెనక ఎంతో కష్టం దాగుంది. తాజాగా మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో పటిష్టమైన సౌతాఫ్రికా జట్టును 38 పరుగుల తేడాతో చిత్తు చేసింది నెదర్లాండ్స్ టీమ్. ఈ విజయం ఇటు డచ్ టీమ్ తో పాటుగా వన్డే వరల్డ్ కప్ కు ఓ ఊపు తెచ్చింది. ఇక ఈ విజయం తర్వాత నెదర్లాండ్స్ లో ఉన్న అనేక మంది హీరోలు వెలుగులోకి వచ్చారు. వారిలో ఒకడు డచ్ మీడియం పేసర్ పాల్ వాన్ మీకెరెన్. ఈ మ్యాచ్ తర్వాత అతడు గతంలో చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అతడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉబెర్ ఈట్స్ ఫుడ్ డెలివరీలో బాయ్ గా పనిచేశాడు. ఇదే విషయాన్ని అప్పట్లో ట్వీట్ చేశాడు పాల్ వాన్ మీకెరెన్. “ఈరోజు నేను క్రికెట్ ఆడాల్సింది. కానీ.. పరిస్థితుల దృష్ట్యా నేను ఉబెర్ ఈట్స్ లో ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తున్నాను. అయితే పరిస్థితులు మారుతాయి.. ఎల్లప్పుడు నవ్వుతూ ఉండండి” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో.. అతడి స్టోరీ తెలిసిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇదిలా ఉండగా.. క్రికెటర్ అయిన తర్వాత కూడా పాల్ వాన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వెన్నునొప్పి కారణంగా.. సోమర్సెట్ తో చేసుకున్న ఒప్పందం రద్దు అయ్యింది. దీంతో కొన్ని రోజులు నెదర్లాండ్స్ టీమ్ కు ఆడే అవకాశం కూడా లేకుండా పోయింది. కాగా.. నేడు అన్ని కష్టాలను ఎదుర్కొని వరల్డ్ కప్ లో డచ్ టీమ్ సంచలన విజయం నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాడు పాల్ వాన్ మీకెరెన్. ఈ మ్యాచ్ లో మార్క్రమ్ తో పాటుగా మార్కో జాన్సన్ వికెట్లు తీశాడు. మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొని, క్రికెట్ లో రాణిస్తున్న పాల్ వాన్ మీకెరెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments