Panneer Selvam, Sasikala – ప‌న్నీర్ సెల్వంలో ఈ మార్పేందీ?

అన్నాడీఎంకే చీఫ్‌ పదవి విషయంలో పన్నీర్ సెల్వం ,పళని స్వామి ఏక‌తాటిపైకి వ‌చ్చార‌ని, శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పళనిస్వామి సిద్ద‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌చ్చాయి. శశికళ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు క‌లిపార‌ని పార్టీలోని ఓ వ‌ర్గం సంబ‌రాలు చేసుకుంది. ఇద్దరి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. పార్టీ సమయ్వయ కర్తగా పన్నీర్‌సెల్వం , ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిస్వామి.. పార్టీ సారథ్య పగ్గాలను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. దీనిపై శ‌శిక‌ళ సీరియ‌స్ అయ్యారు. త‌న‌ను పార్టీలోకి రాకుండా ఎవ‌రూ అడ్డుకోలేర‌ని అప్పుడే ప్ర‌క‌టించారు. క‌ట్ చేస్తే.. రెండు నెల‌ల్లోనే ప‌న్నీర్ సెల్వం మాట‌ల్లో మార్పు క‌నిపిస్తోంది.

తప్పులు చేసిన వాళ్లను క్షమించాలని పన్నీర్‌ సెల్వం చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. అయితే.. చిన్నమ్మకు ఎట్టి పరిస్థితుల్లో రీఎంట్రీ ఉండదన్నారు మాజీ మంత్రి జయకుమార్‌. ఈ వ్యాఖ్యలతో తమిళనాట ప్రకంపనలు మొదలయ్యాయి. తమిళ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు చిన్నమ్మ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అన్నాడీఎంకే జాయింట్‌ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పన్నీర్‌సెల్వం తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. తప్పు చేసి పశ్చత్తాపపడుతున్న వారిని క్షమించాలని.. వారికి తిరిగి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని వ్యాఖ్యలు చేశారు. దీనిపై అన్నాడీఎంకే పార్టీ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. శశికళ ని మళ్ళీ పార్టీ లో చేర్చే ప్రక్రియను ప‌న్నీర్ సెల్వం చేస్తున్నారా అని ప్రత్యర్ధులు అనుమానిస్తున్నారు. కాగా, శశికళ ని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదని , అన్నాడీఎంకే పార్టీ చాలా బలంగా ఉందని , శశికళ చేతిలో పార్టీని పెట్టడం మంచిది కాదని అన్నారు మాజీ మంత్రి జయకుమార్‌.

పన్నీర్ సెల్వం వ్యాఖ్యల కారణంగా శశికళ పై తమ అభిప్రాయం మారదని ,పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళ కు వర్తించవని జయకుమార్ కౌంటర్‌ ఇచ్చారు. శశికళకు పన్నీర్‌ సెల్వం చాలాకాలం నుంచి సన్నిహితంగానే ఉంటున్నారు. కొద్దినెలల క్రితం పన్నీర్ సెల్వం భార్య చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు శశికళ. అన్నాడీఎంకేలో శశికళకు చోటు లేకుండా కొద్దిరోజుల క్రితమే పళనిస్వామి వర్గం తలుపులు మూసేసింది. అన్నాడీఎంకేలో అసలు ప్రధాన కార్యదర్శి పదవి లేకుండా రాజ్యాంగాన్ని మార్చేశారు. ఇదే సమయంలో పన్నీర్‌సెల్వం ఇలా మాట్లాడ‌డం అన్నాడీఎంకేలో దుమారం రేపుతోంది.

Also Read : బీజేపీలో ఏమిటీ మార్పు.. అన్నీ మెచ్చే నిర్ణయాలే

Show comments