కశ్మీర్‌ కేంద్రంగా పాక్‌ కొత్త ప్రధాని కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ నూతన ప్రధానమంత్రిగా ‘పాకిస్తాన్ ముస్లింలీగ్‌-నవాజ్‌’ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు, 70 ఏళ్ల షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ స్వల్ప అస్వస్థతకు గురవడంతో.. ఆపద్ధర్మ అధ్యక్షుడు సాదిఖ్‌ సంజ్రానీ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన తొలి ప్రసంగమంతా కశ్మీర్‌ కేంద్రంగా సాగింది.

కశ్మీరీలకు దౌత్యపరమైన, రాజకీయ, నైతిక మద్దతును అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. భారత్‌-పాక్‌ మధ్య సత్సంబంధాలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నానని, అయితే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనకుండా దాన్ని సాధించలేమన్నారు. ‘‘2019 ఆగష్టులో ఆర్టికల్‌ 370ని భారత్‌ నిర్వీర్యం చేసిన సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ ఏం చేశారు ? కశ్మీర్‌ రోడ్లపై రక్తం పారుతుంటే ఎలా స్పందించారు ? అనేది గుర్తుకు తెచ్చుకోవాలి’’ అని షెహబాజ్‌ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌తో చర్చించేందుకు ముందుకురావాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. దీనిపై భారత ప్రధాని మోడీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. పాక్‌లో శాంతి, సుస్థిరతలు నెలకొనాలని,ఉగ్రవాదం నుంచి విమోచన లభించాలని భారత్‌ ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు.. పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ నవాజ్‌ షరీఫ్‌ రంజాన్‌ పండుగ ముగిసిన తర్వాత మే మొదటివారంలో పాక్‌కు తిరిగొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Show comments