OTT Subscription Prices : అలవాటు పడిన వినోదం – పెంచినా భరించాల్సిందే

కరోనా లాక్ డౌన్ టైంలో ఓటిటి కంటెంట్ కి విపరీతంగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులకు మెల్లగా ఆయా కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. సబ్క్రిప్షన్ ధరలను ఏకంగా 50 శాతానికి పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. త్వరలో అమెజాన్ ఏడాది చందా 999 నుంచి ఏకంగా 1499కి చేరబోతోంది. మాములుగా చూసుకుంటే ఈ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. కానీ గత రెండేళ్లుగా ప్రైమ్ కొత్త సినిమాల కోసం చేస్తున్న పెట్టుబడులు, వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెడుతున్న వైనం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమేర సబబే కానీ మరీ ఇంత భారీగా కాకపోయినా కొద్దికొద్దిగా పెంచితే బాగుండేది. మళ్ళీ ఇది ఎప్పుడు రివైజ్ అవుతుందో చెప్పలేం.

అందుకే ప్రైమ్ వీలైనంత త్వరగా పాత ధరకే రెన్యూవల్ చేసుకోమని తమ చందాదారులకు పిలుపు ఇచ్చింది. ఎన్ని రోజులు అనేది మాత్రం చెప్పడం లేదు. హాట్ స్టార్ కూడా ఇదే బాటలో ఉంది. తమ విఐపి రేట్ ని పెంచుతున్నట్టు గతంలోనే ప్రకటించింది. ప్రైమ్ తో లయన్ గేట్స్ ప్లే లాంటి అంతర్జాతీయ సంస్థలు జట్టు కట్టాక కాంబో ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఆహా లాంటి లోకల్ తెలుగు కంటెంట్ యాప్స్ మాత్రమే ఇంకా ఈ ధరల జోలికి వెళ్ళలేదు. 2021లో సబ్స్క్రైబర్స్ బేస్ ని బలపరుచుకునే దిశగా కొత్త సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతోంది. పెడుతున్న ఖర్చు చూస్తుంటే త్వరలోనే ఇదీ పెంపు బాట పట్టక తప్పేలా లేదు.

మొత్తానికి ఇప్పుడు ఓటిటిలు సగటు ఆడియన్స్ వినోదంలో కీలక భాగంగా మారిపోయాయి. వీటిని వేరు చేసి చూడలేని పరిస్థితి వచ్చింది. థియేటర్లో రిలీజైన సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయినా నెల లోపే డిజిటిల్ లో వస్తుండటంతో వెయ్యి రెండు వేలు కుటుంబం మొత్తం కోసం పెట్టడం సగటు మధ్య తరగతి జీవులు మరీ భారంగా అనుకోవడం లేదు. మల్టీ ప్లెక్సులో ఓ సినిమా చూసేంత ఖర్చుతో ఏడాది ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుంది. సరిగ్గా ఇక్కడే ఓటిటిల పంట పడుతోంది. అందుకే జనం అలవాటు పడ్డాక మెల్లగా బిజినెస్ ప్లాన్లు మారుస్తున్నారు. శాటిలైట్ ఛానల్స్ లాగా త్వరలో మరికొన్ని ఓటిటిలు రావడం ఖాయమే

Also Read : Bheemla Nayak : పవన్ సినిమాకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందా ?

Show comments