సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఎక్కడో ఒకచోట ట్రాన్స్ జెండర్స్ వివక్షకు గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం, అవకాశాల దృష్ట్యా వారికి రిజర్వేషన్స్, ప్రాధాన్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే 2021లోనే ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక ఆస్పత్రులు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఉస్మానియాలో ట్రాన్స్ జెండర్స్ క్లికనిక్ ని ప్రారంభించింది. ఇక్కడ త్వరలో లింగ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా జరపనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2021 నుంచే ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ, జీడిమెట్లలో ట్రాన్స్ జెండర్స్ తో నడిచే క్లినిక్స్ ఉన్నాయి. వాటిలో కేవలం ట్రాన్స్ జెండర్స్ కోసం మాత్రమే కాకుండా.. హిజ్రా, ట్రాన్స్ మెన్, క్రాస్ డ్రెస్సర్స్, లింగ నిర్ధారణ కాని వారికి కూడా సేవలు అందిస్తారు. ఇప్పుడు ఉస్మానియాలో కూడా ట్రాన్స్ జెండర్స్ క్లినిక్ ని ప్రారంభించారు. ఇక్కడ త్వరలో లింగ మార్పిడి సర్జరీలు కూడా చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా ట్రాన్స్ జెండర్స్ సర్జరీ కోసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. చాలామంది ఈ సర్జరీని దుబాయ్ వెళ్లి చేయించుకుంటారు. అలాగే అందుకు ఖర్చు మాత్రమే కాకుండా చాలా ఇబ్బంది కూడా అవుతుంది. అదే ఉస్మానియా ఆస్పత్రిలో సర్జరీలు ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఈ క్లినిక్ ప్రారంభంపై ట్రాన్స్ జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.