వివాదాల‌కు చెక్ : కొల్లేరు ‘ఏలూరు’లోకే

కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్ర‌జ‌ల‌కు పాల‌న‌ను చేరువ చేయ‌డ‌మే కాకుండా.. ప‌లు వివాదాల‌కు కూడా చెక్ ప‌డేలా యంత్రాంగం గ‌ట్టి క‌స‌ర‌త్తు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో స‌రిహ‌ద్దు వివాదాలు స‌హా కొన్ని స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యేవి. కొత్త జిల్లాల్లో వాటికి తావు లేకుండా ప్రాంతాల విభ‌జ‌న జ‌రిగింది. ఏలూరు లోని కొల్లేరు సరస్సు ను అందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.ఇప్పటి వరకు రెండు జిల్లాల మధ్య కొల్లేరు స‌ర‌స్సు ఉండేది. ఇప్పుడు సంపూర్ణంగా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. గ‌తంలో సరిహద్దు, అభయారణ్యానికి సంబంధించి వివాదాలు, చేపల సాగులో ఆధిపత్య పోరు ఇలా రకరకాల సమస్యలు కొనసాగుతుండేవి. జిల్లాల పునర్విభజన కొల్లేరుకు అతి పెద్ద మేలు చేసింది.

కృష్ణాజిల్లాలోని కైకలూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పాటవుతున్న ఏలూరు జిల్లాలో కలవడంతో పూర్తి కొల్లేరు విస్తీర్ణం ఏలూరు పరిధిలోకి చేరింది. 64 కొల్లేరు గ్రామాలు, మూడున్నర లక్షల జనాభా, 2.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరంతా కొత్త జిల్లాలో కలిసింది. కొల్లేరు ప్రాంతాన్ని ఒకే గూటికి తీసుకురావడం హర్షణీయమ‌ని కొల్లేరు పరిరక్షణ సమితి ప్రతినిధి – భూపతిరాజు తిమ్మరాజు అన్నారు. కృష్ణా జిల్లాలోని కొల్లేరు తీర గ్రామాలన్నింటినీ ఏలూరు జిల్లాలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో దీని అభివృద్ధికి బాటలు వేసినట్టు అవుతుంద‌ని చెప్పారు.

ఆసియాలోనే అతి పెద్ద సరస్సుగా ఖ్యాతి…

ఆసియాలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు ఖ్యాతిగడించింది. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఇది సహజసిద్ధంగా ఏర్పడింది. 2,32,600 ఎకరాల్లో సుమారు 312 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొల్లేరు విస్తరించి ఉంది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మండలాల్లో కొల్లేరు విస్తరించింది. కొల్లేరు పరిధిలో 64 గ్రామాల్లో 3.50 లక్షల జనాభా ఆవాసం ఉంటుండగా, 90 శాతం మందికి పైగా కొల్లేరు వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొల్లేరుకు బుడమేరు, తమ్మిలేరు నదుల వరద నీటితో పాటు 14 పిల్ల కాలువలు, 15 డ్రెయిన్లు, కాలువల్లోని నీరు వచ్చి చేరుతుంది.

ఈ నీటినంతటినీ తనలో ఇముడ్చుకునే ప్రకృతిసిద్ధమైన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా కొల్లేరు రూపాంతరం చెందింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన ఏలూరు కాలువ ఉన్నాయి. సాధారణంగా కొల్లేరు సముద్ర మట్టానికి ఎనిమిది అడుగుల ఎత్తున ఉండేది. వివిధ వాగులు, నదుల నుంచి వచ్చే వరద నీటిని బట్టి ఇది ఒక్కోసారి పది అడుగుల వరకు ఉండేది. ఈ అడుగుల లెక్కనే కాంటూరు లెవెల్‌ అని పిలుస్తారు. 2,32,600 ఎకరాల విస్తీర్ణంలో 1.60 లక్షల ఎకరాలు అభయారణ్యం పరిధిలో ఉన్నాయి.

ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు

కొల్లేరుపై ఆధారపడి ప్రతి ఏటా రూ.200 కోట్ల చేపల విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా. ప్రతిరోజూ ఇక్కడి నుంచి తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్‌కు లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయి. కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమడోలు కేంద్రాలుగా ప్రతి నిత్యం ఎగుమతులు జరుగుతున్నాయి. కొల్లేరులో నల్లజాతి చేప రకమైన కొరమేను ఎక్కువగా లభిస్తోంది. దీనికి దేశీయ మార్కెట్‌లో కేజీ రూ.400 నుంచి రూ.600 వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం ఈ రకం రోజూ 100 టన్నులకు పైగా ఎగుమతులు జరుగుతున్నట్టు అంచనా.

Also Read : చర్చల వైపు అడుగులు పడ్డాయ్‌

Show comments