బొత్స లాజిక్‌ పాయింట్‌.. నిజమే కదా సోము..?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి కాలం ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఏపీలో బలపడాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. ఉపయోగిస్తున్న అస్త్రాలు బూమరాంగ్‌ అవుతూ.. చివరికి వారికే నష్టం చేకూరుస్తున్నాయి. దేవాలయాలపై దాడులంటూ గతంలో చేసిన హడావుడి ఏ మాత్రం ఫలితం ఇవ్వకపోగా.. బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుందనే విమర్శలను ఎదుర్కొంది. ఇవేమీ లాభం లేదనుకుని చీప్ లిక్కర్‌ ట్రిక్‌ ఉపయోగించగా.. అది కాస్త దేశ స్థాయిలో బీజేపీని పలుచన చేసింది. తాజాగా పేర్లు మార్పు అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురాగా.. అది కూడా కమలం పార్టీకి బూమరాంగ్‌ అవుతోంది. 

విశాఖ కేజీహెచ్, గుంటూరు జిన్నా టవర్‌ల పేర్లు మార్చాలనే డిమాండ్‌ను బీజేపీ తాజాగా తెరపైకి తెచ్చింది. వారి పేర్ల స్థానే దేశీయ నేతల పేర్లు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దశాబ్ధాల క్రితం నుంచి ఉన్న ఆ పేర్లను మార్చాలని ఇప్పుడు బీజేపీ నేతలు డిమాండ్‌ చేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయనే భావన ఎవరికైనా కలుగుతుంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లపాటు బీజేపీ రాష్ట్రంలో టీడీపీతో కలిసి అధికారం పంచుకుంది. ఆ సమయంలో.. విశాఖ కేజీహెచ్, గుంటూరు జిన్నా టవర్‌ పేర్లను ఎందుకు మార్చలేదంటూ బొత్ససత్యనారాయణ బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు ఇలాంటి దురుద్దేశపూర్వకమైన డిమాండ్లు చేయడం వెనుక బీజేపీ నేతలకు రాజకీయపరమైన లక్ష్యాలు ఉన్నాయంటూ బొత్స బీజేపీ నేతల తీరును ఎండగట్టారు.

రాజకీయంగా ఎదగాలంటే.. ఏ పార్టీ అయినా ప్రజల కోసం పని చేయాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా వారి తరపున పోరాటాలు చేయాలి. నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడాలి. సమస్య పరిష్కరించేది ప్రభుత్వమే అయినా.. క్రెడిట్‌ మాత్రం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన రాజకీయ పార్టీకే దక్కుతుంది. ఈ దారిలో పని చేయని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్లో విశ్వాసం పొందలేదు. బీజేపీకి కూడా ఇందుకు మినహాయింపు లేదు. ఈ తరహా రాజకీయాలు చేయని బీజేపీ నేతలు.. ఎప్పుడూ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే యత్నిస్తూ విఫలమవుతున్నారు.

2014–2018తోపాటు అంతుకు ముందు కూడా టీడీపీతో కలిసి బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంది. ఆయా సమయాల్లో వినిపించని పేర్ల మార్పు డిమాండ్లు ఇప్పుడే ఎందుకు అనే ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏం చెబుతారు..? తాజా వ్యవహారం వల్ల సోము చేసిన చీప్ లిక్కర్‌ రాజకీయం పక్కకు పోయింది. బహుశా.. చీప్ లిక్కర్‌ మాటల నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు బీజేపీ నేతలు పేర్ల మార్పు డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారనే సందేహాలు కలుగుతున్నాయి. ఏమైనా.. ఈ తరహా రాజకీయాల వల్ల బీజేపీకి లాభం లేకపోగా.. నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : ఏపీలో యూపీ అజెండా! -బీజేపీ ఎత్తులు.. రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి

Show comments