Idream media
Idream media
రాష్ట్ర విభజన నుంచి.. పార్లమెంట్ లో తాజాగా వస్తున్న ప్రకటనల వరకు అన్నింటినీ పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, ఇపుడు నరేంద్రమోడీ ఆలోచనా విధానాలు ఏపీకి నష్టం చేకూర్చేలానే ఉంటున్నాయి.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్రాను రెండు రాష్ట్రాలుగా విడగొడితే ఇటు తెలంగాణాలోను అటు ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని సోనియా ఆలోచించారు. రెండు రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై సోనియాగాంధీకి పెద్దగా అవగాహన లేదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేంత పరిస్థితి లేదు. దాంతో వాళ్ళుచెప్పింది నిజమే అనుకుని సోనియా రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించేశారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ దెబ్బతినేసింది. తెలంగాణాలో ఏదో పర్వాలేదు కానీ ఏపీలో అయితే ఏకంగా భూస్ధాపితమే అయిపోయింది. విభజనతో కాంగ్రెస్ పార్టీకి శుభంకార్డు పడిపోయింది.
ఇపుడు మోడీ విషయానికి వస్తే ప్రత్యేకహోదా ప్రత్యేక రైల్వేజోన్ అంశం నానుతోంది. నిజానికి ఈరెండు హామీలు విభజన చట్టంలోనివే. కానీ హామీలను మోడి దిగ్విజయంగా తుంగలో తొక్కేశారు. ఏపీ మీద ఏదో కసున్నట్లుగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఎందుకింతగా రాష్ట్రంపైన మోడీకి వ్యతిరేకత ? ఎందుకంటే ఏపీ ప్రయోజనాలకు ఎంత పెద్దపీట వేసినా బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. గడచిన ఏడేళ్ళుగా ఏదో పద్దతిలో మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుంటే ఏపిలో మాత్రం పాతాళంలోకి జారిపోతోంది. సారధులను ఎంతమందిని మార్చినా ఎన్ని జాకీలను ఉపయోగించినా పార్టీమాత్రం పైకి లేవటం లేదు. ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చిన ఆయనే ఇప్పుడు ప్యాకేజీతో సరిపెట్టుకోమని చెబుతున్నారు.
ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నదేమంటే సోనియా ఏమో.. స్థానిక పరిస్థితులను అంచనా వేయకుండా.. సమైక్య రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించేశారు. ఫలితంగా ఏపీ దెబ్బతింది. కాంగ్రెస్ కూడా దెబ్బతినేసింది. విభజన సమయంలో అండగా ఉంటామంటూ హామీ ఇచ్చిన మోడీ ఏమో ఇప్పుడు పార్టీపరంగా ఏమాత్రం ఉపయోగం లేని రాష్ట్రానికి ఎందుకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే అప్పట్లో సోనియా ఆలోచనలు, ఇప్పుడు మోడీ ఆలోచనలతోనే ఏపీ నష్టపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : పార్టీల హామీల వర్షం