Modi, Donation, Bjp – సొంత పార్టీకి మోడీ విరాళం 1000 రూపాయలు

భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా విరాళాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ సహాయం అందించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసి పార్టీ కోసం, బలమైన భారత్ కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘భారతీయ జనతా పార్టీకి పార్టీ ఫండ్ కోసం 1,000 రూపాయలు విరాళం అందించాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనే మా ఆదర్శం, మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్‌ మరింత బలోపేతం అవుతుంది.

బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండని మోడీ తన పోస్ట్ లో కోరారు. ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇలా అందరూ విరాళాలు ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే బిజెపి విరాళాల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్దాంత కర్తలలో ఒకరైన దీన్ దయాల్ శర్మ వర్ధంతి ఆ రోజు. అప్పటి వరకు ప్రతీ కార్యకర్త… 5 రూపాయల నుంచి గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు విరాళాలు ఇవ్వవచ్చు.

అటు బిజెపి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు షేర్ చేస్తున్నారు. అయితే దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కార్పోరేట్ విరాళాలు ఎక్కువగా వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. సంఘ్ పరివార్ లో ముందు నుంచి ఉన్న సభ్యులు గాని, బిజెపి తీర్థం పుచ్చుకున్న కార్పోరేట్ లు గాని, ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రులు గానీ… బిజెపికి భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఇక బిజెపిని నేతలను ప్రసన్నం చేసుకోవాలని భావించిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

ఎక్కువ విరాళాలు వచ్చే పార్టీ, ధనిక పార్టీ కూడా భారతీయ జనతా పార్టీనే కావడం గమనార్హం. 2019-’20 ఆర్థిక సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి వివరాలు లేని వ్యక్తుల నుంచి రూ. 2,642.63 కోట్లు అందాయని ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసిన లెక్కలలో పేర్కొంది. బిజెపికి వచ్చిన వసూళ్లు తాము అధ్యయనం చేసిన ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 78.24%కి సమానమని ఆ సంస్థ ప్రకటించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఆ పార్టీకి వచ్చిన విరాళాలు 785 కోట్లు.

విరాళం ఇచ్చిన వ్యక్తులు 5576 మంది కాగా యావరేజ్ న వాళ్ళు ఒక్కొక్కరు 14 లక్షలు విరాళం ఇచ్చారు. ఇంత ధనిక పార్టీ ఇప్పుడు మళ్ళీ కార్యకర్తల నుంచి ఈ స్థాయిలో విరాళాలు సేకరించడం ఎంత కరెక్ట్ అనే ప్రశ్న వినపడుతోంది. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో పార్టీ పేరుతో కార్యకర్తల నుంచి విరాళాలు వసూలు చేయడం కరెక్ట్ కాదని… బిజెపికి ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు ఎందుకు ఈ కార్యక్రమం అని ప్రశ్నిస్తున్నారు.

Show comments