Idream media
Idream media
ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ సుగంధాల వ్యాపారి ఉదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన ఇంట్లో రూ.250 కోట్లు బయటపడిన వైనంపై ప్రధాన పక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ వ్యాపారితో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ ప్రధాని మోడీ, అమిత్‌షా ఆరోపించారు. ‘నోట్ల కట్టలు ఉన్న బాక్సులు బయటపడ్డాయి. ఇది కూడా మేమే చేశామని వాళ్లు(సమాజ్‌వాదీ పార్టీ) చెబుతారని అనుకుంటున్నా. 2017కి పూర్వం అవినీతి సుగంధాన్ని యూపీ మొత్తం వ్యాపింపచేశారు. ఇదీ వారి నిర్వాకం’ అని పరోక్షంగా అఖిలేశ్‌పై విరుచుకుపడ్డారు.
కాన్పూర్‌లో మంగళవారం మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని ఐదేళ్లు దోచుకునేందుకు లాటరీ తగిలినట్లుగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయని దుయ్యబట్టారు. ఇంట్లో లెక్కతేలని రూ.250 కోట్ల నగదు పట్టుబడటంతో అరెస్టయిన సుగంధాల వ్యాపారి పీయూష్‌జైన్‌కు అఖిలేశ్ మద్దతు ఉందని బీజేపీ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. వీటిని అఖిలేశ్ యాదవ్ ఖండించారు. పీయూష్ జైన్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘బీజేపీ పొరపాటున తమ పార్టీకి చెందిన వ్యాపారిపైనే దాడులు చేయించి దొరికిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ నేత పుష్పరాజ్ జైన్‌కు బదులుగా పీయూష్ జైన్‌పై అధికారులు దాడులు జరిపారు. నోట్ల రద్దు విఫలమైందని చెప్పడానికి ఈ ఉదంతం చాలు. కొత్త నోట్ల కట్టలను పట్టుకున్న అధికారులే వాటి మూలాలను వెల్లడిస్తారు’ అని అఖిలేశ్ తిప్పికొట్టారు.
మరో కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే ఎంతో సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణానికి నడుం బిగించాలని గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 54 వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో 50వేలకు పైగా స్టార్టప్‌లు ఉంటే.. వీటిలో పదివేల స్టార్టప్‌లు గత ఆరునెలల కాలంలోనే వచ్చాయని గుర్తుచేశారు. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలబడిందంటే అందుకు కారణం ఐఐటీ విద్యార్థులేనని ప్రశంసించారు. కాన్పూర్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు.
Also Read : వేడెక్కిన రాజకీయం : ఏపీ బీజేపీకి వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్