Idream media
Idream media
మహమ్మారి వైరస్ కరోనా మందు పేరుతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సెలబ్రిటిగా మారిన ఆనందయ్య తన సొంత గ్రామస్తుల నుంచి ఊహించని పరిణామం ఎదుర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టానని, దానిని ఉచితంగా పంపిణీ చేస్తున్నానని ఇటీవల ఆనందయ్య చెప్పుకుంటున్నారు. దీంతో ఆనందయ్య గ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు వివిధ రాష్ట్రాల నుంచి మందు కోసం వస్తున్నారు.
దీని వల్ల తమ గ్రామంలో వైరస్ వ్యాప్తి జరుగుతోందని, గత ఏడాది ఇబ్బందులు పడ్డామని, ఈ ఏడాది అదే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో గ్రామస్తులు ఆనందయ్యను మందు పంపిణీ చేయొద్దని హెచ్చరించారు. ఈ రోజు ఆయన ఇంటి వద్దకు వెళ్లిన గ్రామస్తులు.. ఆనందయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టానంటూ ఆనందయ్య అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు. గ్రామంలో మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మరో వైపు ఆనందయ్య మాత్రం తాను ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టానని చెబుతున్నారు. ఉచితంగా పంపిణీ చేస్తానని, ప్రభుత్వం నుంచి అనుమతి కూడా ఉందంటూ చెప్పుకొస్తున్నారు. గత ఏడాది కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో ఆనందయ్య ఇచ్చే మందుకు డిమాండ్ ఏర్పడింది. అనుమతులు లేకపోయినా ఆయన మందు పంపిణీ చేశారు. మందు కోసం భారీగా ప్రజలు ఎగబడడంతో.. ప్రభుత్వం మందు ప్రామాణికతను తేల్చేందుకు సిద్ధమైంది. పరీక్షల తర్వాత.. మందుకు భారత ఆయూష్ శాఖ అనుమతి ఇవ్వలేదు.
అనుమతులు ఉన్నా లేకున్నా.. కొంత మంది ఆనందయ్య మందు కోసం ఎగబడుతున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆనందయ్య మందును.. తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రతినిధులు ఈ మందును పంపిణీ చేయడం విశేషం.
కరోనా మందు అంటూ ఫేమస్ అయిన ఆనందయ్య.. ఇటీవల రాజకీయపరమైన ప్రకటనలు కూడా చేశారు. తాను త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి మరోమారు వార్తల్లో నిలిచారు. ఇలా సాగుతున్న ఆనందయ్య ప్రస్థానంలో.. ఆయనకు తన సొంత గ్రామస్తుల నుంచే ఊహించని షాక్ తగలడం గమనార్హం.
Also Read : రేవంత్ ఏ మాత్రం తగ్గడం లేదుగా..