ఆ బాధ్యత సీఎం తనపై పెట్టారంటున్న ఏపీ నూతన మంత్రి

రాష్ట్రంలో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను సీఎం వైఎస్‌ జగన్‌ తనపై పెట్టారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ తెలిపారు.మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ లో భాగంగా మంత్రి పదవిని దక్కించుకున్న జోగి రమేష్‌.. ఈ రోజు శనివారం బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య రమేష్‌ తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 31 లక్షల మందికి ఇల్లు కట్టించే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచారన్నారు. అందరికి గూడు కట్టించాలని, ఆ ఇళ్లల్లో గృహప్రవేశం చేయాలనేది ముందున్న లక్ష్యమని తెలిపారు.

విశాఖపట్నం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు కోర్ట్‌లకు వెళ్లారని జోగి రమేష్ విమర్శించారు. విశాఖలో లక్షమంది పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఫైల్‌పై మంత్రి జోగి రమేష్ తొలిసంతకం చేశారు.

ఇంతకు ముందు 90 సిమెంట్ బ్యాగ్ లు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చారని, ఇకపై 140 బ్యాగ్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి రమేష్ తెలిపారు. నాణ్యమైన గృహాలు నిర్మాణం చేస్తామని చెప్పారు.. అందరికి ఇల్లు సంతృప్తి స్థాయిలో ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. తనకు అడుగడుగునా అండగా నిలిచిన జిల్లా శాసనసభ్యులు, నియోజకవర్గ ప్రజలకు మంత్రి జోగి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు.

Show comments