Idream media
Idream media
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదోలా వార్తల్లో ఉండాలని ఆరాటపడుతుంటారు. ఆ క్రమంలో ఒక్కోసారి సొంత పార్టీ నేతలపై కూడా నోరు పారేసుకుంటారు. అలాంటి సందర్భాల్లో టీడీపీ నేతలే జేసీ పరువును చాలా సార్లు తీసేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అయితే.. ‘‘నీ రాజకీయాలు తాడిపత్రిలో చేసుకో.. అనంతపురంలో చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త.. నువ్ బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరూ లేరు..’’ అంటూ తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కూడా పార్టీని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు మానుకోవాలని ఓ సందర్భంలో జేసీకి హితవు పలికారు. ఇష్టముంటే పార్టీలో కొనసాగాలని లేకపోతే దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం చంద్రబాబు వద్దకు వచ్చి.. తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆపై పార్టీని భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు.. ఇలా సొంత పార్టీ నేతలు కూడా జేసీపై గుర్రుగానే ఉంటారు. అలాగే వార్తల్లో నిలిచేందుకు తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వింత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సమయం, సందర్భం లేకుండా ఓ సినిమాలో కమేడియన్ సంక్రాంతి, దీపావళి, హోలీ అంటూ అసందర్భంగా వేడుకలు చేస్తుంటారు. ఇప్పుడు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈరోజు ఫ్రీడమ్ డే వేడుకలు నిర్వహించారు. అదేంటి.. ఈరోజు ఆగస్టు 15 కాదు.. జనవరి 26 కూడా కాదు.. ఫ్రీడమ్ డే వేడుకలు ఏంటి అని ఆశ్చర్యపోకండి. దానికి జేసీ ఓ రీజను కూడా చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పంచ్ ఇచ్చారని జేసీ వర్గీయులు ఫీలవుతున్నప్పటికీ.. ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి భంగం వాటిల్లేలా వింత చేష్టలు తగవని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్ద శుక్రవారం ఫ్రీడం డే పేరుతో సంబరాలు నిర్వహించారు. మాకు ఇప్పుడే ఫ్రీడం వచ్చిందంటూ సంబరపడ్డారు. ఎందుకంటే.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జేసీ ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అప్పట్లో జరిగిన గొడవలు దాదాపు పదిహేను రోజుల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. అయితే ఈ సంఘటన తరువాత టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారని, అందుకే ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని ఆయన ఫీలింగ్. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ జెండా ఎగరడం వాస్తవం. ఆ రోజు జరిగిన సంఘటన కారణంగానే తమ కార్యకర్తలు భయం వీడి.. మనో ధైర్యంతో ముందుకు వచ్చారని, దానికి గుర్తుగా ఫ్రీడమ్ డే సంబరాలు చేసుకున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు.
ఇంకా వింత ఏంటంటే.. అప్పట్లో ఈ వివాదానికి కారణం ఇసుక కావడంతో.. ఒక కేక్‌పై ఇసుక బండి వేయించారట. ఆ కేక్‌ను అభిమానులు, కార్యకర్తల సమక్షంలో జేసీ కేక్ కట్ చేశారు. అనంతరం ఇంటి వద్ద బాణా సంచా కాల్చారు. అలాగే విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుక ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది క్రితం జేసీ చేసిన రాద్దాంతం వల్ల స్థానికంగా ప్రజలు మనశ్శాంతిని కోల్పోయారు. అప్పట్లోనే జేసీ దూకుడుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రబాబునాయుడు కూడా దీనిపై చర్చించారు. అయినప్పటికీ జేసీలో ఇప్పటికీ మార్పురాకపోవడంపై అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.