Idream media
Idream media
ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో వంగవీటి రంగా హత్య ఓ పెద్ద సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండను చవిచూసింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది. 1988 డిసెంబర్ 26న రంగా హత్యకు గురయ్యాడు. అంతకు ముందు సోదరుడు వంగవీటి రాధాకృష్ణ హతమయ్యాడు. దీంతో రంగా తన సోదరుడి స్థానంలో నాయకత్వంలోకి వచ్చాడు. కాపులు రంగాను తమ తిరుగులేని నాయకుడిగా పరిగణించారు. రంగా కూడా తన సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవాడు. కానీ.. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను హత్య చేశారు.
రంగా వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా.. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందలేకపోయారు. ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులతో తన కెరీర్ కు తానే బ్రేక్ వేసుకున్నాడనే పేరు ఉంది. ఎందుకంటే.. విజయవాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపుతో పాటు, ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్న కుటుంబం వంగవీటి రంగాది. కానీ.. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వంగవీటి రాధా ఒక్క గెలుపుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2004లో తొలిసారి తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేసినప్పుడు రంగాకున్న పేరుతో ఘనవిజయం సాధించారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ వెంటనే.. వచ్చిన ఎన్నికల్లో ఈ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆతర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. రాధా. వైసీపీ వైపు మొగ్గు చూపారు. 2014లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అంటే.. వరుస పరాజయాలు పొందారు.
వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపు కోసం తాపత్రయపడుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ లేదు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వార్తల్లో ఉండేందుకో, వాస్తవమో తెలియదు కానీ.. తండ్రి తరహాలో తన హత్యకు కూడా కుట్ర పన్నారంటూ వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యానించారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను కూడా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని చూసి భయపడను. ప్రజల్లోనే ఉంటా. నాపై రెక్కీ చేసిన వారి పేర్లు త్వరలోనే బయటకొస్తాయి’’ అని రాధా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాధా వ్యాఖ్యల్లో నిజమెంత, ఆ అవసరం ఇప్పుడెవరికైనా ఉందా, ఎవరు.. అనేది రాధానే చెప్పాలి.