Idream media
Idream media
ఒక్క లేఖ దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది… దాదాపుగా దశాబ్దం నుంచి సంచలనంగా మారిన హత్యకేసులో హత్యకు గురైన యువతి బ్రతికి ఉందంటూ నిందితురాలు రాసిన లేఖ సిబిఐ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2012లో తన కుమార్తె షీనా బోరాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ, సంచలనానికి తెరలేపారు. తన కుమార్తె బ్రతికే ఉందని పేర్కొంటూ ఈ కేసుని విచారించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ వివాదాస్పద పరిణామంపై సీబీఐ అధికారులు మాత్రం పెదవి విరుస్తున్నారు. అయితే, పోలీసులు వెలికితీసిన మృతదేహం షీనా బోరాదేనని ఫోరెన్సిక్ నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో ఆ లేఖకు ఎటువంటి విలువ లేదని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇంద్రాణి తన లేఖలో… తన కుమార్తె షీనా బోరా… కాశ్మీర్ లో ఉన్నట్టు ప్రస్తావించింది. అయితే షీనా బోరాను కాశ్మీర్ లో సజీవంగా చూసినట్టుగా… ఇంద్రాణికి జైలులో ఒక మహిళ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం నివేదిక ప్రకారం… పోలీసులు స్వాధీనం చేసుకున్న అస్థిపంజరం షీనా బోరాదేనని విచారణలో తేల్చారు. నిపుణుల బృందం కూడా 23 ఏళ్ల షీనా బోరాను గొంతు నులిమి చంపినట్లు తేలింది. ఇక ఆమె మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడం అని నివేదికలో పేర్కొన్నారు.
షీనా బోరా మృతదేహాన్ని పోలీసులు 2015లో వెలికితీశారు మరియు మృతదేహం షీనా దేనా కాదా అని నిర్ధారించడానికి అనేక వైద్య పరీక్షలు కూడా అప్పట్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురు ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం అలాగే ప్రత్యక్ష సాక్షుల వివరణలు… నిందితుల వాంగ్మూలాలు మరియు సాక్ష్యాల ఆధారంగా షీనా బోరాను హత్య చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది. షీనా బోరాను 2012లో ఇంద్రాణి ముఖర్జీ తన అప్పటి భర్త పీటర్ అలాగే మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి ఆర్థిక లావాదేవీల గొడవలతో హత్య చేసింది.
Also Read : మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే
2015లో ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది. అప్పటి పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా నేతృత్వంలోని ముంబై పోలీసులు ఈ కేసు విచారణలో కీలక విషయాలను బయటపెట్టారు. శవాన్ని ఎక్కడ పడేశారు, ఏంటీ అనే దానికి సంబంధించి అతని వద్ద నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. ఇక ఆమె లేఖను సిబిఐ లెక్కలోకి తీసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.