Idream media
Idream media
గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఈ నెల 22న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను బోర్డు బడ్జెట్‌కు ఆమోదముద్ర తెలుపనున్నారు. కేంద్ర గెజిట్‌ను అనుసరించి.. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో పాటు.. మూలధనం కింద రెండు తెలుగు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు జమచేయాలని, అనుమతిలేని ప్రాజెక్టుల వివరణాత్మక నివేదికలను (డీపీఆర్‌లు) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి.
ప్రాజెక్టుల అనుమతికోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో తెలంగాణ సమర్పించిన మూడు డీపీఆర్‌లకు క్లియరెన్స్ రావడంతో..వాటిపైనా బోర్డు చర్చించి, తన అభిప్రాయాలను తెలుపనుంది. అనంతరం డీపీఆర్‌లను తదుపరి అనుమతి కోసం సాంకేతిక సలహాదారుల సంఘానికి(టీఏసీ) పంపించనున్నారు. చనకా కొరటా, చౌటపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వర్ ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లకు సీడబ్ల్యూసీ పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా రెండు డీపీఆర్‌లను బోర్డుకు సమర్పించింది. పోలవరం కాలువ నుంచి మూడు దశల్లో నీటిని ఎత్తిపోసి… విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం డీపీఆర్‌తో పాటు రాజమహేంద్రవరం వద్ద చేపట్టిన వెంకటనగరం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఏపీ సమర్పించింది. జీఆర్‌ఎంబీ ఇన్‌చార్జి చైౖర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్‌తో పాటు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలు, అంతరాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొననున్నారు.