General Naravane, CDS – కొత్త దళపతి వచ్చారు

భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే ఎంపికయ్యారు. ఈ మేరకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ కమిటీ చైర్మన్‌ (సీడీఎస్‌)గా నరవణేను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్రివిధ దళాల అధిపతుల్లో నరవణేనే సీనియర్‌ కావడంతో.. ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. మూడు దళాలను నరవణే సమన్వయం చేసే బాధ్యతలను నిర్వర్తిస్తారు.

త్రివిధ దళాలను సమన్వయం చేసేందుకు సీడీఎస్‌ పోస్టును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పదేళ్లుగా ఉన్నా.. 2019లో అది కార్యరూపం దాల్చింది. అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పదవీ విరమణ చేసిన వెంటనే.. ఆయన్ను సీడీఎస్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చరిత్రలో సీడీఎస్‌ కీలక అధ్యయనం గా నిలిచింది.

ఈ నెల 8వ తేదీన తమిళనాడులోని ఊటి కొండల్లో బిపిన్‌ రావత్‌ దంపతులు ప్రయాణిస్తున్న ఆర్మీ హెలిక్టాపర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. బిపిన్‌ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న తరుణంలో.. ఆయన దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. వెంటనే సీడీఎస్‌ ఎంపికపై కసరత్తు మొదలు పెట్టి.. పది రోజుల్లోనే నూతన దళపతిని ఎంపిక చేసింది.

అంచెలంచెలుగా ఎదిగిన నరవణే..

మహారాష్ట్రలోని పుణేలో 1960 ఏప్రిల్‌ 22న జన్మించిన మనోజ్‌ ముకుంద్‌ నరవణే (ఎం.ఎం. నరవణే) 1980లో భారత ఆర్మీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. 1982లో లెఫ్టినెంట్‌గా, 1985లో కెప్టెన్‌గా, 1991లో మేజర్‌ గా ఎదిగారు. 11 ఏళ్లపాటు మేజర్‌గా పని చేసిన నరవణే.. 2002లో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత మరో మూడేళ్లకు 2005లో కల్నల్‌గా ఎంపికయ్యారు. 2010లో బ్రిగేడియర్‌గా, 2013లో మేజర్‌ జనరల్‌గా పదోన్నతులు పొందారు. 2015లో లెఫ్టినెంట్‌ జనరల్‌గా ఎంపికైన నరవణే.. 2019 డిసెంబర్‌ వరకు ఆ పదవిలో పని చేశారు. 2019 డిసెంబర్‌ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సీడీఎస్‌గా కూడా పని చేయనున్నారు.

Also Read : సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

Show comments