చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడిదొడుకులు చూసిన కాంగ్రెస్ పార్టీలో తాజాగా కొత్త ముసలం బయలుదేరింది. ఒకపక్క ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూలు విడుదల చేసిన రోజే కాంగ్రెస్ అసమ్మతి వాదులంతా ఏకమయ్యారు. జీ – 23 పేరుతో జమ్మూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీ అధిష్టానం తీరుకు నిరసనగా గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
కొత్తతరం రావాలి
కాంగ్రెస్ పార్టీ కు కొత్తతరం రావాలి. నాయకత్వ మార్పు అవసరం. పార్టీ సమూల ప్రక్షాళన జరిగితే కానీ మళ్లీ పుంజుకోవడం అసాధ్యం అంటూ గతంలోనే కాంగ్రెస్కు చెందిన 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. సరిగ్గా ఈ 23 మంది నాయకులే శనివారం జమ్మూలో భేటీ అవ్వడం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనే సంస్థ శాంతి సమ్మేళన పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించి మరోసారి తమ అసమ్మతి గళాన్ని సోనియాకు వినిపించేందుకు అంతా సిద్ధమయ్యారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ, భూపిందర్ సింగ్ హుడా, రాజ్ బబ్బర్, మనీష్ తివారి, మనీష్ టంక వంటి వారు ఈ గ్రూపులో ఉన్నారు.
రకరకాల వ్యాఖ్యానాలు
సమావేశంలో అసమ్మతి సీనియర్లు మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద వీరు ద్వేషంతో ఉన్నట్లు గాని, పార్టీ వీరిని అశ్రద్ధ చేసిందన్న మాట ఎక్కడ రాలేదు. సమావేశంలో గులాం నబీ ఆజాద్ దగ్గర్నుంచి మాట్లాడిన నేతలంతా పార్టీని బతికించుకోవడం అని, తామంతా పార్టీ కోసమే పని చేస్తామని చెప్పుకోవడం విశేషం. అందరినీ కాపాడే పార్టీ పరిస్థితి బాగోక పోతే మిగిలిన వారు ఎలా ఆనందంగా ఉంటారని ప్రశ్నించడం ద్వారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నడవడిక మీదనే వీరు దృష్టి పెట్టి మిగిలిన నాయకులకు ఒక సంకేతం పంపినట్లు అర్థమవుతోంది. పార్టీ తమకు అన్యాయం చేయలేదు అంటూనే పార్టీని బతికించుకోవాలి అనడం ద్వారా పార్టీ నేతలు కార్యకర్తల దగ్గర నుంచి సానుభూతి పొందేందుకు వీరు ఈ మార్గం ఎంచుకున్న రా అనేది చూడాలి.
గుర్తుకొస్తున్న ఆజాద్ మోదీ కన్నీళ్లు!
అసమ్మతి వాదులకు నాయకత్వం వహిస్తున్న గులాం నబీ ఆజాద్ ఇటీవల రాజ్యసభ నుంచి రిటైర్ అయినప్పుడు ప్రధాని మోదీ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడి భావోద్వేగానికి గురి కావడం, ఆతర్వాత గులాం నబీ ఆజాద్ సైతం మోడీ మాటలకు కృతజ్ఞతలు చెప్పడం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి ప్రస్తుతం కీలక సారథ్యం వహిస్తున్న మైనారిటీ నేతను మోదీ కావాలనే ఒక భావోద్వేగ అనుభూతితో పంపడం, దాని మీద ఆజాద్ సైతం తగిన విధంగా సానుకూలంగా స్పందించడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గానికి వెన్నుదన్నుగా బీజేపీ ఏమైనా పావులు కదుపుతున్న అన్న అనుమానం కలుగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ అసమ్మతి వాదులంతా కేవలం కాంగ్రెస్ పార్టీ మీదనే తమ అక్కసు వెళ్ళగాక్కరు తప్పితే, అధికారంలో ఉన్న బిజెపిను నిలువరించేందుకు ఎలాంటి సూచనలు, సలహాలు సభా వేదిక నుంచి ఇవ్వలేదు. కేవలం సొంత పార్టీ మీద విమర్శలు కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే రాజకీయ శత్రువుగా ఉన్న బీజేపీ మీద ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం చూస్తే ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది.
కాంగ్రెస్ కు తలనొప్పి
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. కేరళ, అస్సాం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడాల్సి ఉంది. ఇక తమిళనాడులో డిఎంకె కూటమి పక్షాన కీలకం కానుంది. కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి లో ఇటీవల పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజా మద్దతుతో నిలబెట్టుకో వలసిన అవసరం ఉంది. ఇన్ని కీలకమైన బాధ్యతలు ఉన్న సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లంతా బయటకు వచ్చి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం పార్టీకు సానుకూలాంశం కాదు. కీలక సమయాల్లో పార్టీని నిలబెట్టాలి చేసిన వారంతా ఇప్పుడు రచ్చ చేసుకోవడం ద్వారా బీజేపీ బలోపేతానికి పరోక్షంగా సహకరించిన ట్లే.