కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి మృతి

మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి (69) మరణించారు. కరోనా సోకడంతో ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.

గత నెల 15వ తేదీన సబ్బం హరి కరోనా బారినపడ్డారు. వైరస్‌ సోకిన విషయం నిర్థారణ అయిన తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే వైరస్‌ తగ్గకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన 25వ తేదీన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్‌తోపాటు.. ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో సబ్బం హరి ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు వెల్లడించారు. అయితే ఇన్ఫెక్షన్‌ పెరిగిపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు.

సబ్బం హరి జూన్ 1, 1952న బంగారునాయడు, అచ్చియమ్మ దంపతులకు విశాఖపట్టణంలోని చిట్టివలసలో జన్మించారు. ఆరుగురు సంతానంలో చివరివాడు. సొంతూరులోని తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ ఏవీఎన్ కళాశాలలో పూర్తి చేశారు. సబ్బం హరి, లక్ష్మిలది ప్రేమ వివాహం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కాంగ్రెస్‌లో కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన హరి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. విశాఖ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా, 1985లో విశాఖ నగర యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశాఖ మేయర్‌ అభ్యర్థిత్వం దక్కింది. మేయర్‌గా గెలిచిన సబ్బం హరి.. విశాఖ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.

దిగవంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ఆర్‌ అకాల మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌కు మద్ధతుగా మాట్లాడేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తూ.. 2014 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 6,644 ఓట్లు పొందారు.

2014 ఎన్నికల తర్వాత ఏ పార్టీలోనూ చేరని సబ్బం హరి.. రాజకీయ విశ్లేషకుడుగా కొనసాగారు. న్యూస్‌ ఛానెళ్ల చర్చల్లో టీడీపీకి అనుకూలంగా, వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడేవారు. కొన్నాళ్లకు టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2019 సాధారణ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై ఓడిపోయారు.

Also Read : కరోనా కట్టడికి ఏపీ కీలక నిర్ణయం.. ఇకపై డే కర్ఫ్యూ

Show comments