Ex Minister Fareeduddin – మాజీ మంత్రి ఫరీదుద్దీన్ క‌న్నుమూత‌

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న‌ ఆయన.. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో మైనారిటీ శాఖ మంత్రిగా సేవ‌లు అందించారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2016లో కేసీఆర్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న సిద్దిపేట మున్సిపాలిటీలో ఇంటింటి ప్ర‌చారంలో పాల్గొని శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు.

గ్రామ స‌ర్పంచి నుంచి మంత్రిగా..

గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎండీ ఫ‌రీదుద్దీన్‌.. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో జహీరాబాద్ ఎస్సీలకు రిజర్వు అయింది. దీంతో గీతారెడ్డికి అవకాశం లభించింది. ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు నుంచే..కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు త‌లెత్తిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ ఎన్నిక‌ల‌తో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫరీదుద్దీన్ పరోక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారని గీతారెడ్డి అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఫరీద్ ను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. అనంత‌రం ఏడాది పాటు రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్నారు ఫ‌రీదుద్దీన్.

విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ‌లో ప‌రిస్థితులు మార‌డం, మంత్రి హ‌రీశ్‌రావు సంప్ర‌దింపులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్ప‌టికి అధికార పార్టీ పక్షాన సిద్దిపేట‌ జిల్లాలో చెప్పుకోదగిన మైనార్టీ నాయకుడు లేకపోవడం.. ఫరీదుద్దీన్‌కు క‌లిసి వ‌చ్చింది. 2016లో ఆయ‌న‌ను కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు. మ‌రోసారి అవ‌కాశం వ‌స్తుంద‌ని చూసినా అది జ‌ర‌గ‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న టీఆర్ ఎస్ బ‌లోపేతానికి కృషి చేస్తూ వ‌చ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సాన్నిహిత్యం

ఫరీదుద్దీన్ వైఎస్సార్ కు చాలా సన్నిహితుడు.ఆ సాన్నిహిత్యంతోనే మంత్రి పదవిని ఇచ్చారు.2009 నియోజకవర్గాల పునర్విభజనలో జహీరాబాద్ నియోజకవర్గం SC రిజర్వ్డ్ కావటంతో గీతారెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. సీనియర్ నేత అయిన ఫరీదుద్దీన్‌కు పోటీచేసే అవకాశం ఇవ్వాలన్న తలంపుతో రాజశేఖర్ రెడ్డి ఆయనకు అంబర్ పేట నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు.

స్థానికేతరుడు కావటం, కిషన్ రెడ్డి హవా ఎక్కువగా ఉండటంతో ఫరీదుద్దీన్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

జహీరాబాద్ ఒకనాడు కాంగ్రెస్ కంచుకోట..1957 నుంచి 2018 మధ్య జరిగిన 14 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 1994 మరియు 2018లో మాత్రమే ఓడిపోయింది. జహీరాబాద్‌లో కాంగ్రెస్ బలానికి ప్రధాన కారణం బాగారెడ్డి అయితే రెండవ కారణం ఫరీదుద్దీన్.బాగారెడ్డి ఓటమనేది లేకుండా వరసగా ఏడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు.

జహీరాబాద్ నుంచి 2009,2014లో గెలిచిన గీతారెడ్డి 2018లో ఓడిపోవడానికి ఫరూరుద్దీన్ మద్దతు లేకపోవటం ఒక ముఖ్యకారణం.

సీఎం కేసీఆర్ సంతాపం

మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంత్రులు, ఇత‌ర పార్టీల నేత‌లు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అభిమానులు కూడా ఫరీదుద్దీన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Show comments