Etela, BJP – తెలంగాణ బీజేపీలో ఈటె‌ల సొంత దారి

మాజీ మంత్రి ఈటె‌ల రాజేంద‌ర్ చేర‌డంతో బీజేపీకి బ‌లం పెరిగింద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వెలువ‌డ్డాయి. ఇప్పుడు ఆ బ‌ల‌మే పార్టీని బ‌లాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈటెల తీరు తో పార్టీలోని స‌మిష్టిత‌త్వానికి ముప్పు వాటిల్లుతోంద‌ని అగ్ర‌నాయ‌క‌త్వం ఆందోళ‌న ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. పార్టీలోని అందరిదీ ఒకదారి అయితే.. ఈటెల సొంత దారిలో వెళ్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈటె‌ల రాక‌తో బీజేపీకి బ‌లం పెర‌గ‌డం ఎలాగున్నా.. ఆయ‌న చేస్తున్న ప‌నులతో కొత్త చిక్కులు వ‌స్తున్నాయ‌ని పార్టీ వ‌ర్గాల టాక్‌. పార్టీ ఎజెండాను మాత్రమే ముందుంచే కమలం పార్టీలో సొంత ఎజెండాతో ముందుకుపోతూ కొర‌క‌రానికొయ్యగా మారుత‌ున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కూడా గెలిస్తే ఈటెల‌.. ఓడితే బీజేపీ అన్న‌ట్లుగానే ప్ర‌చారం జ‌రిగింది. రాజేంద‌ర్ కూడా బీజేపీ జెండా కంటే.. సొంత ఎజెండాను న‌మ్ముకునే ప్ర‌చారం సాగించారు. ఆ ఎన్నిక‌లో విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అదే పంథా కొన‌సాగిస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఈటె‌ల రాజేంద‌ర్ కన్ఫ్యూజన్‌ క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా రూటే సపరేటు అంటూ సింగిల్‌గా దూసుకెళ్తున్నారట ఈటెల. హుజురాబాద్‌ బైపోల్‌లో ఘ‌నవిజ‌యం తర్వాత సొంతరాగం అందుకుంటున్నారు. విజయం తర్వాత ఇది బీజేపీ గెలుపు కాదు..తన వ్యక్తిగత విజయం అంటూ అక్కడక్కడ చేసిన కామెంట్స్‌ను నాయ‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గెలుపుకోసం పార్టీ త్రీవంగా కృషి చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డం ఏంట‌నే భావ‌న‌ అప్పట్లో వ్యక్తమైంది. అయినా చూసీచూడనట్లుగా వదిలేశారు. అయితే ఈ మధ్య ఈటె‌ల అమలుచేస్తోన్న సొంత ఎజెండాను పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని తెలుస్తోంది.

ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నట్లు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ప్రకటించారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే అన్ని ఎలక్షన్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే టీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున.. ఈ ఎంఎల్‌సీ ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని రాష్ట్ర నాయకత్వం భావించింది. అందుకే పోటీకి దూరంగా ఉంది. కానీ ఈటె‌ల మాత్రం కరీంనగర్‌లో ర‌వీంద‌ర్ సింగ్‌కు మద్దతు ఇస్తున్నామని…ఆదిలాబాద్‌లో క్యాండిడెట్‌ నూ తానే పెట్టించానని ప్రకటించారు.. ఈ ఇష్యూపై పార్టీ చాలా సీరియస్‌గా ఉందట. ఏకపక్షంగా ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని సీనియ‌ర్లంతా తప్పుపడుతున్నారట.

Also Read : కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు..?

అలాగే.. బీజేపీ నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాల్లోనూ ఈటెల సొంత ఆహ్వానాలతోనే పర్యటిస్తున్నారనే భావన కూడా పార్టీ నాయకత్వంలో ఉందట. సమావేశాలకు వెళ్లడమే కాకుండా.. అక్కడ త‌న సామాజికవ‌ర్గానికి చెెెందిన కులసంఘాల‌తో సన్మానాలు చేయించుకుంటూ పార్టీ కార్యక్రమాలకూ ఇబ్బంది కలిగిస్తున్నారని భావిస్తున్నారు. ఈటెల తీరుపై రాష్ట్ర నాయ‌క‌త్వ సమావేశంలో చ‌ర్చించాల‌ని నిర్ణయించినట్లు సమాచారం. సొంత ఎజెండాతో వెళ్లే నేతలకు ఇబ్బందులు తప్పవంటూ అందరికీ ఓ హెచ్చరిక పంపాలని యోచిస్తోందట. మరి ఈటెల ఎపిసోడ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Show comments