Idream media
Idream media
డీఎస్సీ–2018 పరీక్షల్లో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు రేపు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఆయా అభ్యర్థులను ఆన్‌లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చిన స్కూళ్లలోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2,654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అత్యధిక పోస్టులున్న ఎస్జీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ఉత్తర్వులు ఇస్తారు.
2018 డీఎస్సీలో ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూళ్లతోపాటు వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమైంది. ఇప్పటికీ కొన్ని కేటగిరీల పోస్టులపై న్యాయ వివాదాలున్నాయి. నియామకాలు ఇంకా జాప్యం కాకుండా ఉండేందుకు న్యాయ వివాదాలు లేని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది.