ఎస్పీ రామతీర్థం దోషులను పట్టుకోగలరా..?

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు కారణం మీరంటే.. మీరంటూ నిందించుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటన ద్వారా తాము రాజకీయంగా లబ్ధిపొందాలనే ఆలోచనను ఆయా పార్టీలు చేస్తున్నట్లు ప్రజలకు కూడా అర్థమవుతోంది. అందుకే ఈ ఘటనను ఓ కొలిక్కి తేచ్చేందుకు ప్రభుత్వం గట్టిగా పని చేస్తోంది. ఈ దశ్చర్యకు పాల్పడిన వారిని పట్టుకుని రామతీర్థంపై జరుగుతున్న రాజకీయాలకు చెక్‌ చెప్పాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు.. సీఐడీ విచారణకు ఆదేశించడంతో అర్థమవుతోంది.

రామతీర్థం ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు పట్టుకోగలరా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విజయనగరం ఎస్పీ రాజకుమారి. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై జరిగిన దాడుల్లో దోషులను పట్టుకున్న చరిత్ర రాజకుమారికి ఉండడమే ఇందుకు కారణం. రాజకుమారి సమర్థురాలైన అధికారిణిగా గుర్తింపు ఉంది. టీడీపీ ప్రభుత్వంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీగా పని చేశారు. 2017 డిసెంబర్‌లో రాజమహేంద్రవరం నగరం లాలాచెరువు సెంటర్‌లోని మసీదులో మౌజమ్‌ హత్యకు గురయ్యారు. బలమైన కర్రతో తలపై మోదీ హత్య చేశారు. మత గ్రంధాలను తగులబెట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సున్నితమైన అంశం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే వీటన్నింటిని ఎస్పీ రాజకుమారి సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శాంతి కమిటీలు వేసి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చేశారు. మరో పక్క నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల గాలింపు జరుగుతుండగానే.. మళ్లీ రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట మసీదు మౌజమ్‌ ఇంటి డోర్‌ కర్టన్‌కు గుర్తు తెలియనిదుండగులు నిప్పు పెట్టారు. మసీదు పక్కనే ఉన్న మౌజమ్‌ ఇంటి చుట్టు పక్కలా.. మత గ్రంధాన్ని కాల్చారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మళ్లీ మొదటికి వచ్చింది. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అయితే.. ఈ ఘటనలను ఛాలెంజ్‌గా తీసుకున్న రాజకుమారి.. మౌజమ్‌ను హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన పాత నేరస్థుడుగా గుర్తించారు. దేవాలయాలు, మసీదుల్లోని హుండీలను దొంగిలించేందుకు ఈ తరహా ఘటలనకు పాల్పడుతుంటాడని తేల్చారు. గతంలో అతనిపై ఏపీలో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించడంతో.. ఈ ఘటనలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు.

లాలా చెరువు మసీదు ఉన్న ప్రాంతంలోని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నివాసం ఉంటున్నారు. మసీదుకు సోము వీర్రాజు నివాసం కేవలం 100 మీటర్ల లోపు ఉంటుంది. ఈ ఘటన జరిగిన తర్వాత కొద్ది నెలలకు రాజకుమారిని విజయవాడ నగర క్రైం విభాగం డీసీపీగా ప్రభుత్వం నియమించడం విశేషం. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ రాజకుమారికి ప్రాధాన్యత లభించింది. విజయనగరం జిల్లా ఎస్పీగా ఆమె సేవలందిస్తున్నారు.

Show comments