ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే ఒక పాత సామెత ఉంటుంది. దాన్ని గుర్తు చేసేలా ఉంది తెలంగాణలోని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపు ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు తలనొప్పిగా మారింది. దానికి అసలు కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మా టీఆర్ఎస్ అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ డిబేట్‌లో బాలరాజు సవాల్ చేయడమే. కానీ ఆయన చేసిన సవాల్ లో కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన ఓట్లు వచ్చి అప్పుడు ఈటెల గెలవాలి, అలా జరిగితే తాను రాజీనామా చేస్తానని చిన్న లిటిగేషన్ పెట్టారు. అయితే ఆయన లిటిగేషన్ లు ఎవరికి కావాలి? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలవడంతో సవాల్ చేసిన గువ్వల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
గువ్వల మాట మీద నిలబడాలి అంటూ నెటిజన్లు గువ్వలను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. కొంతమంది ఇతర పార్టీల నేతలు గువ్వల ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేస్తూ ఉండడంతో ఆయనకు పెద్ద ఎత్తున జనాలు ఫోన్ చేసి మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారు అంటూ అడిగేస్తున్నారు. ఇక వరుసగా ఫోన్లు వస్తూనే ఉండడంతో గువ్వల ఫోన్ స్విచ్చాఫ్ పెట్టుకునే పరిస్థితి. ఇక ఆయనకు ఫోన్లు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? గువ్వలకు ఫోన్ చేసి రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ అడిగిన ఆడియో క్లిప్స్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయన టాక్ ఆఫ్ ధీ తెలంగాణ అయిపోయారు. ఆయన సవాలుకు అచ్చంపేట ప్రజలు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మళ్లీ ఉప ఎన్నికలలు వస్తాయని, అప్పుడు తమకు కూడా దళిత బంధు సహా కొన్ని కొత్త పధకాలు కూడా వచ్చే అవకాశం ఉందని కొత్త లాజిక్ చెబుతున్నారు.
ఎన్నికలు జరిగితే తమకు కూడా ఓటుకు రూ.10వేలు ఇస్తారని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రాజీనామా అంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మీద బాలరాజు స్పందించారు. హుజురాబాద్‌లో ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ సహా బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడంతో ఈటెల రాజేందర్ గెలిచారని గువ్వల బాలరాజు ఆరోపణలు చేస్తున్నారు. ఈటెల నిజాయతీగా గెలిస్తే నేను రాజీనామా చేసేవాడిని, దౌర్జన్యంతో ఆయన గెలిస్తే నేనెందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు. తనను రాజీనామా చేయమని డిమాండ్ చెసే వారిలో బీజేపీ కార్యకర్తలు, వారి సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అన్నట్టు గతంలో కూడా బండ్ల గణేష్ కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే నేను 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటాని అనడంతో పెద్ద ఎత్తున టార్గెట్ అయ్యారు.