CM YS Jagan, OTS Scheme – ఓటీఎస్‌ను ప్రారంభించిన సీఎం.. జరిగే మేలును పూసగుచ్చినట్లు వివరించిన జగన్‌

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాల ద్వారా రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లపై ఉన్న రుణాలను మాఫీ చేస్తూ.. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ద్వారా నామమాత్రపు రుసుముతో ఆ ఇళ్లపై హక్కులు కల్పించే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. పలువురు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఇచ్చిన సీఎం జగన్‌.. లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఓటీఎస్‌ ద్వారా ఇళ్లపై సర్వ హక్కులు పొందవచ్చని సీఎం జగన్‌ తెలిపారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఓటీఎస్‌ పథకం వల్ల జరిగే మేలును పూసగుచ్చినట్లు వివరించారు.

‘‘ స్వాతంత్ర్యం వచ్చినప్పుటి నుంచి ఇంటి పట్టాలు వస్తూనే ఉన్నాయి. ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కులు తీసుకొచ్చేందుకు ఈ పథకం తీసుకొచ్చాం. ఈ రోజుకు ఓటీఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 8.26 లక్షల మందికి ఈరోజు నుంచి రిజిస్ట్రర్‌ డాక్యుమెంట్లు వారి చేతిలో పెడతాం. ఇది ఒక గొప్ప మార్పునకు చిహ్నం. ఈ 52 లక్షల మంది చేతిలో పెట్టబోయే ఆస్తి విలువ 1.58 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని వారికి ఇష్టమొచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు.

ఒక ఇంటికి కిరాయి చెల్లిస్తే.. ఆ ఇంట్లో ఉండేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. అదే సొంత ఇళ్లు అయితే.. మార్కెట్‌ రేటుకు అవసరమైన సమయంలో అమ్ముకునే హక్కు మనకు ఉంటుంది. ఈ రోజు మనం ఉంటున్న ఇంటిని అమ్ముకునే హక్కు లేదు. సంతానానికి బదలాయింపు చేసే అవకాశం లేదు. అవసరమైన సమయంలో బ్యాంకులో తనఖా పెట్టుకుని డబ్బు తీసుకునే అవకాశం లేదు.

ఇలాంటి పరిస్థితులలో ఏ హక్కులేని గత కాలం నుంచి ప్రభుత్వాలు కట్టించిన ఇళ్ల పరిస్థితిని పూర్తిగా మార్చబోతున్నాం. ఏ ఇంటి యజమాని అయినా తన అవసరాల కోసం తనఖా పెడతామంటే ఏ బ్యాంకు ఒప్పుకోని పరిస్థితిని మార్చబోతున్నాం. అవసరమైతే మార్కెట్‌ రేటుకు అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వబోతున్నాం. ఇదే గోదావరి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంటికి, చేయని ఇంటికి ధరలో ఎంతో వ్యత్యాసం ఉంది. తణుకు 19వ వార్డులో 2 సెంట్లలోని ఇంటి మార్కెట్‌ విలువ 30 లక్షలు ఉంది. సెంటు 15 లక్షలు పలుకుతోంది. 12వ వార్డులో సెంటు 6 లక్షలు, 7వ వార్డులో సెంటు విలువ 15 లక్షలు పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఉన్నాయి.

Also Read : ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో, అర్థం కానంత దూరంలో జగన్

సొంత ఇంటిపై హక్కులు లేని వారు ఎంతో నష్టపోతున్నారు. అమ్ముకోలేరు, తాకట్టు పెట్టుకోలేరు. పిల్లలకు బహుమతిగా ఇవ్వలేరు. ఇలాంటి పరిస్థితిలో పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కారించాలో ఆలోచించిన తర్వాత.. పుట్టుకు వచ్చిందే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు కట్టించి ఇచ్చిన ఇళ్లపై లబ్ధదారులకు సర్వహక్కులు కల్పించబోతున్నాం. హక్కులు కల్పించిన తర్వాత.. మార్కెట్‌ రేటుకు రిజిస్ట్రర్‌ ఆస్తిగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం వల్ల ఇళ్లు కబ్జాకు గురికాకుండా ఉంటుంది.

ప్రభుత్వ సహాయంతో సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న 12లక్షల మందికి కేవలం 10 రూపాయలకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా ఉచితం. 2011 ఆగస్టు 15 వరకు స్థలాలను తనఖా పెట్టి, ఇళ్ల నిర్మాణాల కోసం రుణాలు తీసుకున్న 40 లక్షల మందిపై దాదాపు 14 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇందులో 10 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాం. ఆరు వేల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా.. ఉచితంగా చేయించి ఇస్తున్నాం. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకున్న మిగతా 40 లక్షల మందికి స్వల్ప మొత్తంతో ఇంటిపై హక్కులు కల్పిస్తున్నాం. గ్రామాల్లో 10 వేల రూపాయలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేల రూపాయలు కడితే చాలు. రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. నిర్ణయించిన మొత్తం కన్నా కట్టాల్సిన రుణం తక్కువగా ఉంటే.. ఆ మొత్తం చెల్లిస్తే చాలు.

అసలు, వడ్డీ కట్టిన 43 వేల మందికి హక్కులు కల్పించకుండా కేవలం బీఫాం ఇచ్చారు. వారికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి హక్కులు కల్పిస్తాం. ఒక వేళ ఇళ్లు నిషేధిత భూముల జాబితాలో ఉంటే తొలగిస్తాం. రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పది నిమిషాల్లోనే చేయిస్తాం. ఓటీఎస్‌ పథకం ద్వారా క్లియర్‌ టైటిల్‌తో వివాద రహిత ఆస్తిగా రిజిస్ట్రేషన్‌ చేసి, ఆ పత్రాలను లబ్ధిదారుల చేతుల్లో పెడతాం. 

చరిత్రలో కనీ వినీ ఎరగని విధంగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేశాం. వీటి విలువ 26 వేల కోట్ల రూపాయలు. ఇందులో ఇప్పటికే 16 లక్షల ఇళ్లు కట్టేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇళ్లు కట్టిన తర్వాత ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో 5 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ఉంటుంది. రెండున్నరేళ్లలోనే ఈ పని చేశాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివరించారు.

Also Read : అవకాశం అందిపుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌

Show comments