Idream media
Idream media
కొన్నాళ్ళ క్రితం తిరుపతిలో ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆ సందర్భంలో కొందరికి వార్నింగ్ ఇచ్చారన్న వార్తలు వెల్లువెత్తాయి. అందుకు కారణం ఏంటంటే.. బీజేపీ ఎంపీలు.. పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలని, ఎంత దృఢమైన బంధమైనప్పటికీ కొందరితో రాజకీయంగా దూరంగా ఉండాలని సూచించారట. ఆ వ్యాఖ్యలు బీజేపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరిలను ఉద్దేశించే అని ప్రచారం జరిగింది. టీడీపీకి సమదూరం పాటించాలని అమిత్ షా వారికి స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. అయితే.. సీఎ రమేష్ లో ఇప్పటికీ మార్పు రానట్లే కనిపిస్తోంది. అందుకు తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
ఏపీ పోలీసు శాఖపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తరచూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఆ తరహాలోనే స్పందించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వానికి కూడా అంశంపై లింకు పెట్టారు. “ఏపీ పోలీస్ వ్యవస్థ పై కేంద్రం టెలీస్కోపు నిఘా తో చూస్తోంది. త్వరలోనే ప్రక్షాళన చేస్తుంది“ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ వర్గాలు ఘాటుగానే స్పందిస్తున్నాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు.
సీఎం రమేష్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను ఎలా చూసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ పని తీరును గుర్తించే కేంద్రం అవార్డులు ఇచ్చిందన్నారు. అవన్నీ మర్చిపోయి రమేష్ మాట్లాడుతున్నారని మల్లాది మండిపడ్డారు. ఆయన చంద్రబాబు తరపున మాట్లాడుతున్నారో, బీజేపీ తరపున మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన వాటి గురించి మాట్లాడాలి కాని, చంద్రబాబు కు కోవర్ట్ గా మాట్లాడడం సరి కాదన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం ఇష్టం వచ్చినట్టు పనిచేయడం కుదరదన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డూప్లికేట్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ ఉన్నాయని మల్లాది విష్ణు అన్నారు. సొంత విమానాల్లో తిరిగే సీఎం రమేష్ కి ప్రజా సమస్యల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. మద్యం పాలసీపై సీఎం రమేష్ తో చర్చకు తాను సిద్ధం అని మల్లాది విష్ణు ప్రకటించారు. అదలాఉంటే.. మల్లాది వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి డూప్లికేట్ బీజేపీ కూడా ఉంటే దానికి అధ్యక్షుడు సీఎం రమేశా.. అనే చర్చ నడుస్తోంది.
Also Read : బాబు బాటలోనే ఏపీ బీజేపీ..