Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ సినిమాలకు ఎప్పుడూ పేదపీట వేస్తుంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ రామారావు నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ ప్రముఖులెందరికో పుట్టినిల్లు ఏపీనే. సినిమాలకు ఆదరణ అక్కడే ఎక్కువగా ఉంటుంది. సినీ వినోదం కోసం ఎక్కువగా ఆరాటపడేది సామాన్య ప్రజలే. అందుకే వారికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ధరలు ఎప్పుడూ పెరగడమే కానీ.. తగ్గించిన ఘనత జగన్ సర్కారుదే. ఈ విషయంలో ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ. ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా దీన్ని సమర్థించారు. కానీ.. కొందరు దీనిపై రాద్దాంతం చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇండస్ట్రీ ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తోంది.
సోమవారం జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “సినిమా అంటే.. సినిమా చూసేవాడు, సినిమా తీసేవాడు, సినిమా చూపించేవాడు.. ఈ ముగ్గురే. ఆ ముగ్గురూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ మీద కోట్లాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు. ఇదొక పెద్ద పరిశ్రమ. అందుకే నేనొక విజ్ఞప్తి చేస్తున్నాను. ఫిల్మ్ ఛాంబర్ పెద్దలని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలని, మా అసోసియేషన్ పెద్దలని, దిల్ రాజుగారిని, అల్లు అరవింద్‌గారిని, సురేష్ బాబుగారిని, చిరంజీవిగారిని, నాగార్జునగారిని, నానిగారిని.. ఇలా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే థియేటర్ల ఓనర్లకి కూడా చెబుతున్నా.. ‘ఎందుకు థియేటర్లు మూసేస్తున్నారు మీరు. మూసేయకండి.. అక్కడ ఎమ్మెల్యేలనో, ఎంపీలనో కలవండి. ఈ విషయాలను జగన్మోహన్ రెడ్డిగారి దగ్గరకు తీసుకెళ్లండి. గవర్నమెంట్‌తో పాజిటివ్‌గా ఉండండి. నెగిటివ్‌గా చూడవద్దు.. ఎమోషన్ అవ్వవద్దు. సినిమా తల్లిని కాపాడుకోవాలి మనం. దయచేసి థియేటర్లు మూసేయవద్దు..” అని సూచించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా దీనిపై స్పందించారు. తమ సమస్య ఒక్క టికెట్ ధర మాత్రమే కాదని.. ఇంకా భిన్న సమస్యలున్నాయని చెప్పారు. అంతేకాదు ఇదే విషయంపై దిల్ రాజు స్పందిస్తూ.. తమకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తామన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని సమస్యలను ఏపీ ప్రభుత్వానికి వివరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. సినిమా, మీడియా వేరు కాదని అన్నారు. ప్రజలకు వార్తలను చేరవేయడానికి మీడియా కీ రోల్ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మీడియా ప్రెజెంట్ చేసే విషయంలో సెన్సిటివ్ గా చూడమని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఏపీ , తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కమిటీ ద్వారా కలుస్తామని చెప్పారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. దయచేసి ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.