Narendra singh tomar, Farm Laws – రైతులను మోసం చేయబోతున్నారా..?

అన్నదాతలను బీజేపీ ప్రభుత్వం మోసం చేయబోతోందా..? రైతులు వ్యతిరేకించిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురాబోతున్నారా..? అంటే.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రే అవునంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఆగ్రో విజన్‌ ఎక్స్‌పోలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలు.. రైతుల అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయి. కొంత మంది వల్ల సరైన చర్చ జరగకపోవడంతో సాగు చట్టాలు వివాదాస్పదమయ్యాయని, అందుకే కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి చెప్పారు. మార్పులతో మళ్లీ సాగు చట్టాలను తీసుకు వస్తామని స్పష్టం చేశారు. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేసేందుకేనన్న మంత్రి… వ్యవసాయ చట్టాలను మళ్లీ తెచ్చి తీరుతామనడంతో చర్చకు తెరలేసింది.

ఏడాది ఆందోళనతో చట్టాలు రద్దు..

గత ఏడాది పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యవసాయ మార్కెట్ల ప్రాధాన్యతను తగ్గించడం, దేశంలో ఎక్కడైనా పంటను అమ్ముకునే అవకాశం కల్పించడం, వ్యవసాయంలో కార్పొరేట్‌ రంగాన్ని ప్రోత్సహించడం.. ఆ చట్టాల ముఖ్య ఉద్దేశాలు. ఈ చట్టాల వల్ల భారతదేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, వ్యవసాయం కూడా కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లిపోతుందనే భయంతో.. దేశ వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు. చట్టాలు రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ వంటి ఉత్తరాధి రాష్ట్రాల రైతులు ఏడాది పాటు ఆందోళనలు నిర్వహించారు. చలి, ఎండ, వాన, కరోనా.. దేన్ని లెక్కచేయకుండా.. రైతులు సాగించిన పోరాటంతో గత నెలలో సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, పార్లమెంట్‌లో చట్టాలను వెనక్కి తీసుకుంటూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.

ఆ అనుమానం నిజమవుతుందా..?

ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాల శాసన సభలకు వచ్చే ప్రారంభంలో ఎన్నికలు జరగబోతున్నందున, రైతుల ఆందోళనల వల్ల ఆ ఎన్నికల్లో నష్టపోతామనే అనుమానంతో బీజేపీ ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమైంది. రైతు సంఘాల నేతలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. చట్టాలను రద్దు చేసి నెల రోజలు కూడా కాకముందే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చెప్పడంతో.. రైతుల అనుమానాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్లీ సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. అదే జరిగితే.. బీజేపీ ప్రభుత్వం.. ఓట్ల కోసం రైతులను నమ్మించి మోసం చేసిందనే అపప్రధను మూటగట్టుకుంటుంది. దాని ఫలితం బీజేపీ ఊహించని విధంగా ఉంటుంది.

Also Read : ఉత్తరప్రదేశ్‌తో నెహ్రూ గాంధీ కుటుంబాల అనుంబధం ఎలాంటిది..?

Show comments