మహారాష్ట్ర లో పోలీస్ అధికారి సచిన్ వాజే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇటీవల రాజీనామా చేసిన మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను సి.బి.ఐ బుధవారం సుమారు రెండు గంటల పాటు విచారించింది. దీంతో చివరకు ఈ కేసు ఎటు తిరిగి ఎటు వెళుతుంది.. అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో దొరికిన కారు దగ్గర నుంచి అనేక మలుపులు తిరుగుతూ చివరకు అది మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. మొదట ముంబై పోలీస్ సచిన్ వాజే పేరు రావడం తో మొదలైన కల్లోలం తర్వాత ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ వాక్యాలతో వేడెక్కింది. ఆయన ఏకంగా మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీద ఆరోపణలు చేయడం, తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శరత్ పవర్ రాజకీయ వారసుడు అజిత్ పవార్ పేరు రావడం సంచలనం అయింది. మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్వయంగా ముంబైలోని బార్లు మద్యం దుకాణాల వద్ద ప్రతి నెల 100 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టారు అని ముంబై పోలీసు కమిషనర్ ఆరోపణలు చేయడం, అది సచిన్ వాజే చేతుల మీదగా నిర్వర్తించడం ఆరోపణలు ఈ నేపథ్యంలో ఈ కేసు మొత్తం రాజకీయ మలుపు తీసుకుంది.
దీంతో ముంబై హైకోర్టులో న్యాయవాది వేసిన పిల్ విచారణకు తీసుకున్న కోర్టు ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకొని వదిలేయడానికి లేదని, ఓ కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి మరో కీలకమైన స్థానంలో వున్న వ్యక్తి మీద చేసిన ఆరోపణలను తీవ్రంగా ఉన్నాయని భావించి వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేయించాలని కోర్టు ఆదేశించింది.
Also Read : మహారాష్ట్రలో రాజకీయ కల్లోలం!
ముంబై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన మరు క్షణమే హోం మంత్రి పదవికి రాజీనామా చేసిన అనిల్ దేశ్‌ముఖ్.. ఆ తర్వాత రెండు రోజులకే సీబీఐ దర్యాప్త చేయాలన్న ముంబై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రిం తలుపుతట్టారు. ఆయనతోపాటు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ రెండు పిటిషన్లను సుప్రిం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తునకు లైన్ క్లియర్ చేసింది.
దీనిపై ఆగమేఘాలమీద రంగంలోకి దిగిన సిబిఐ వెనువెంటనే ఈ కేసు మీద దృష్టి పెట్టింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచి మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ను విచారణ చేయడం ఇప్పుడు ఇది మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారడం, ఏకంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా తయారయింది. దీనిని ప్రతిపక్ష బిజెపి వాడుకోవాలని ప్రయత్నించడం ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కూ కారణమవుతోంది.
ఈ విచారణలో మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఎవరు పేర్లు చెబుతారు .. ఆ పేర్లు సైతం మహారాష్ట్ర రాజకీయాలకు సన్నిహితమైన సంబంధాలు ఉన్న వ్యక్తులు, మంత్రులవి ఉండే అవకాశం ఉండడంతో మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు గందరగోళంగా మారుతోంది.
పూర్తిగా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సాగుతున్న దర్యాప్తులో ఎలాంటి పేర్లు బయటికి రాబోతున్నాయి అన్నది ఇప్పుడు మహారాష్ట్రలో చర్చకు దారితీస్తోంది. అందులోనూ కేంద్రం కనుసన్నల్లో సాగే సీబీఐ, ఎన్ఐఏ లు ఈ కేసులో మరికొంతమంది పేర్లను బయటపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలను ఎటు వైపునకు తీసుకెళ్తాయో చూడాలి.
Also Read : అంబానీ కేసు అనిల్ మెడకు..!