వడ్డీలేని రుణాలు.. షరతులు వరిస్తాయ్‌..!

కేంద్ర బడ్జెట్‌లో ఎన్నో మరకలు ఉన్నప్పటికీ కొన్ని మెరుపులు కూడా ఉన్నాయి. అంతర్గత భద్రతకు బీజేపీ సర్కారు పెద్దపీట వేసింది. ఈ సారి ఏకంగా రూ.1.85 లక్షల కోట్లు కేటాయించింది. నిరుడు బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.20 వేల కోట్లు అధికం. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సింహభాగం కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ కోసం వెచ్చించనున్నారు. ప్రధానంగా దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చనున్నారు. అలాగే.. అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఓ శుభవార్త వినిపించింది. వాటికి ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది.

50 ఏళ్ల వరకు వడ్డీ లేదు..

రూ.లక్ష కోట్ల నిధి నుంచి తీసుకునే అప్పులకు 50 ఏళ్ల గడువుతో వడ్డీ ఉండదని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల రుణ పరిమితులకు అదనంగా ఈ ఆర్థిక సహాయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రుణాలను పీఎం గతిశక్తి, పీఎం గ్రామీణ సడక్‌ యోజన, ఉత్పాదక మూలధన వ్యయాలకు ఉపయోగించాలనే షరతు విధించింది. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ పనుల పూర్తి, బిల్డింగ్‌ బైలాలలో సంస్కరణలు, పట్టణ ప్రణాళిక పథకాలు, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అవసరాల కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు సహాయం చేస్తామని కేంద్రం తెలిపింది.

దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లను కేటాయించినట్లు వెల్లడించింది. కాగా, దేశంలోని జిల్లాలవారీగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని రూపొందించారు. 2022-23 మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు, ఇందులో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. 2025-26 నాటికి దాన్ని 4.5 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 4 శాతం ఆర్థిక లోటును అనుమతించారు. ఇందులో 0.5 శాతం లోటు విద్యుత్‌ రంగ సంస్కరణలతో ముడిపడి ఉంటుంది. దీనికి సంబంధించిన షరతులు 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఉన్నాయి.

Also Read : ఇక “వందే” భారత్

Show comments