Bomb Blast, Kolkata Corporation Election – అక్కడ మ‌ళ్లీ హింస.. ఎన్నిక‌ల్లో బాంబు దాడి

ఈ ఏడాది మార్చిలో బెంగాల్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించిన విష‌యం తెలిసిందే. పోలింగ్ రోజున‌, ఫ‌లితాల అనంత‌రం కూడా రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళనలు వ్య‌క్తం అయ్యాయి. నాడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా జరిగిన హింస, అల్లర్లలో 12 మంది మరణించారు. తమ పార్టీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, వారి ఇళ్ళలోకి చొరబడి దౌర్జన్యాలు చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తే.. మా కార్య‌క‌ర్త‌ల‌ను కొట్టి కొట్టి చంపార‌ని టీఎంసీ ప్ర‌త్యారోప‌ణ‌లు చేసింది. సీఎం మమతా బెనర్జీ ..బెంగాల్ శాంతి కాముక రాష్ట్రమని ప్ర‌క‌టించారు. ఇప్పుడు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బెంగాల్ లో మ‌రోసారి హింస చెల‌రేగింది. బాంబుల మోత మోగింది.

నాడు బెంగాల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలింగ్ రోజున చెల‌రేగిన హింస మ‌రువ‌క ముందే.. మళ్లీ ఎన్నికల హింస చెలరేగింది. కోల్‌కతా మున్సినల్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బెలఘట్టా పోలింగ్‌ బూత్‌ దగ్గర బాంబు దాడి సంచ‌ల‌నంగా మారింది. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణభయంతో ఓటర్లు పరుగులు పెట్టారు. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ లోని 144 వార్డులకు పోలింగ్‌ జరిగింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే టీఎంసీ ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. కొన్ని ప్రాంతాల్లో తమ అభ్యర్ధులపై దాడులు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఎంసీ కార్యకర్తల రిగ్గింగ్‌ను అడ్డుకోలేదని కూడా విమర్శించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాడు ఇవే ఆరోప‌ణ‌ల‌ను టీఎంసీ చేసింది. కాగా, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

2010 , 2015 మున్సిప‌ల్ ఎన్నికల్లో కూడా తృణమూల్‌ గెలిచింది. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని టీఎంసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం 23 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. పలుచోట్ల తృణమూల్‌ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈనెల 21న కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అయితే, బాంబు దాడుల నేప‌థ్యంలో బీజేపీ ఫిర్యాదుల‌పై ఈసీ ఎంత వ‌ర‌కు స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read : ఇరువురు నేతల హత్యలతో అట్టుడికి పోతున్న అలప్పుజ

Show comments