TDP, Chandrababu – ఎంపీకి పోటీపై త‌మ్ముళ్ల టెన్ష‌న్?

తెలుగుదేశం పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. అందునా చంద్ర‌బాబుకు మ‌రీను. అందుకే ఇప్ప‌టి నుంచే చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. కాదు.. క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. గ‌తమంతా ఘ‌న‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ వ‌ర్త‌మానం ఆ పార్టీకి క‌లిసిరావ‌డం లేదు. భ‌విష్య‌త్ పై కూడా పార్టీలోని చాలా మందికి త‌గిన భ‌రోసా క‌నిపించ‌డం లేదు. అందుకేనేమో పోటీకి అందునా ఎంపీగా నిల‌బ‌డాలంటే చాలా మంది భ‌య‌ప‌డుతున్నార‌ట‌. గెలుపు గ్యారంటీలేని ప‌రిస్థితుల్లో.. ఎంపీగా నిల‌బ‌డితే ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేయాల‌ని, ఏడుగురు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు ఆర్థికంగా కూడా మ‌న‌మే చూసుకోవాల్సి ఉంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే గ‌తంలో ఎంపీగా పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపిన వారు, నిల‌బ‌డి ఓడిన‌పోయిన వారు కూడా ఈసారి ఎంపీ సీటు క‌న్నా ఎమ్మెల్యే సీటుపైనే ఎక్కువ ఆస‌క్తిచూపుతున్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.

ఎన్టీఆర్ హ‌యాంలో తెలుగుదేశం పార్టీకి ఏకంగా పార్లమెంట్ లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కింది. చంద్రబాబు జమానాల్లో టీడీపీ రెండు సార్లు గెలిస్తే మూడు సార్లు ఓడింది. ఇక వచ్చే ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటికీ రెడీ కాలేకపోతోంది. పొత్తుల వేటలో ఒక వైపు అధినాయకుడు బిజీగా ఉంటే తాము పోటీ చేసేది లేదని కొందరు తమ్ముళ్ళు చెబుతున్నట్లుగా ప్రచారం అవుతోంది. అందులో ఎంపీగా అయితే స‌సేమిరా అంటున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీకి గెలుపు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లుగా కొంద‌రు వ్య‌క్తిగ‌తంగా చేప‌డుతున్న స‌ర్వేల్లో తేలిపోతోంది. దాంతో ఎంపీ అంటే వద్దు బాబోయ్ అన్న మాట అయితే ఉందిట.

ఏపీలో మొత్తం 25 సీట్లు ఉంటే అందులో గతసారి ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే గెలిచారు. ఆ ముగ్గురిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ మధ్య మళ్లీ యాక్టివ్ అయ్యారు. దాంతో ఆయన ఓకే అంటే టికెట్ ఖాయం. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు రెడీగా ఉంటారు. గుంటూరు నుంచి చూస్తే గల్లా జయదేవ్ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. ఇక విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేయడానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పెద్దగా ఆసక్తి చూపడం లేద‌ని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో అరకు సీటుకు ఈ రోజుకీ క్యాండిడేట్ లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తెచ్చి పెట్టిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజకీయాల పట్ల అనాసక్తిగా ఉన్నారని టాక్. అనకాపల్లి నుంచి గతసారి ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ ఎన్నికల తరువాత వైసీపీలో చేరిపోయారు. ఇక రాజమండ్రి నుంచి గతసారి పోటీ చేసిన మురళీమోహన్ కుటుంబం ఈసారి పాలిటిక్స్ లో లేదు. ఇలాగే ఏలూరులో మాగంటి బాబు కూడా కుటుంబ కష్టాలతో రాజకీయాలను వదిలేేశారు అంటున్నారు.

ఇదే టైమ్ లో నర్సాపురం నుంచి శివరామరాజు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదట. రాయలసీమలో చూసుకున్నా గతసారి పోటీ చేసి ఓడిన వారిలో కొందరు మరణించారు. మరి కొందరు ఇనాక్టివ్ గా ఉన్నారు. చాలా చోట్ల ఇంచార్జులు కూడా కనిపించడం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో టీడీపీకి ఎంపీ అభ్య‌ర్థుల కొర‌త ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మరి మున్ముందు ఏమైనా టీడీపీకి కాస్త ఊపు వ‌స్తే కొత్తగా ఎవరైనా గెలుపు అవకాశాలను చూసుకుని బరిలోకి దిగుతారేమో కానీ ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓకే కానీ ఎంపీ వద్దు అంటున్నవారు చాలా మంది ఉన్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read :  మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా జూలకంటి బ్రహ్మారెడ్డి

Show comments