Idream media
Idream media
గత నెలలో భారీ వర్షాలు, వరదలతో రాయలసీమ చిగురుటాకులా వణికింది. ఈ శతాబ్ధంలో ఎన్నడూ చూడని వరద సీమను ముంచెత్తింది. చెయ్యేరు, పెన్నా వంటి నదులు ఉగ్రరూపం దాల్చాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోగా.. వందలాది చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల ధాటికి వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద పెన్నా నదిపై ఉన్న జమ్మలమడుగు – ముద్దనూరు బ్రిడ్జి కుంగిపోయింది. 16వ పిల్లర్ కుంగిపోవడంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి.
బ్రిడ్జికి మరమ్మత్తులు చేసే వరకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి పక్కనే నదిలో అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేసింది. హై లెవల్ బ్రిడ్జి నిర్మించక ముందు ఉన్న అప్రోచ్ రోడ్డుకు మరమ్మత్తులు చేశారు. ఈ అప్రోచ్ రోడ్డు వినియోగంలో లేకోవడంతో పూర్తిగా దెబ్బతిన్నది. దానిని ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. నది మధ్య భాగంలో నీరు వెళ్లేందుకు తూములు ఏర్పాటు చేసిన అధికారులు.. వాటిపై కాంక్రీటు వేశారు. పాత అప్రోచ్ రోడ్డును మొత్తం నూతనంగా నిర్మించి.. రాకపోకలు సాగేలా తీర్చిదిద్డారు.
జమ్మలమడుగు ఎగువన పెన్నా నదిపై ఉన్న మైలవరం జలాశయం నుంచి భారీగా వరద నీరు పోటెత్తింది. దాదాపు 1.60 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో.. జమ్మలమడుగు – ముద్దనూరు బ్రిడ్జి కుంగిపోయింది. ఫలితంగా జమ్మలమడుగు మీదుగా ముద్దనూరు, పులివెందుల, కదిరి, బెంగుళూరుకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నది ఆవల వైపు ఉన్న గ్రామాలకు జమ్మలమడుగుకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుంగిన బ్రిడ్జి మరమ్మత్తులకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. మార్చిలోపు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు.
అప్రోచ్ రోడ్డు అందుబాటులోకి రాక ముందు దాదాపు మూడు వారాల పాటు సమీప గ్రామాల ప్రజలు పెన్నా నదిలో నుంచే రాకపోకలు సాగించారు. నదిలో పరిమిత స్థాయిలోనే నీరు పారుతుండడంతో పాదచారులతోపాటు ద్విచక్రవాహనదారులు కష్టమైనా నదిలో నుంచే జమ్మలమడుగుకు రాకపోకలు సాగించారు. నదిలో ఇసుక వల్ల రాకపోకలకు ఇబ్బంది పడిన ప్రజలకు అప్రోచ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బందులు తప్పాయి.