AP High Court, Movie Ticket Price – సినిమా టిక్కెట్లపై మధ్యేమార్గం.. హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమా టిక్కెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం తాత్కాలికంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్ల (జేసీ)కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. థియేటర్ల యాజమాన్యాలు టిక్కెట్ల ధరల ప్రతిపాదనలను జాయింట్‌ కలెక్టర్ల ముందు ఉంచాలని ఆదేశించింది. ఆ ప్రతిపాదనలపై జేసీలు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాంతాల వారీగా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో 35ను జారీ చేసింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, పంచాయతీలలో వేర్వేరుగా టిక్కెట్ల ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కొంత మంది నిర్మాతలు స్వాగతించగా.. పెద్ద నటులతో సినిమాలు తీసే నిర్మాతలు వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్లారు. సినిమాను నిర్మించే తమకు టిక్కెట్ల ధరలను నిర్ణయించుకునే హక్కు ఉందని, పాత పద్ధతినే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టులో వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను రద్దు చేసింది.

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. ఏపీ సర్కార్‌ డివిజన్‌ బెంచ్‌లో నిన్న బుధవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన బెంచ్‌.. ఈ రోజు విచారణ చేపట్టింది. ప్రభుత్వ వాదనలను విన్న తర్వాత.. పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.

ఈ రోజు నుంచి థియేటర్ల యజమానులు.. తమ హాళ్లలో సినిమాల ప్రదర్శనకు ఎంత మేర టిక్కెట్‌ ధరను పెట్టాలనుకుంటున్నారో, ఆ ప్రతిపాదనలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత.. జేసీలు ఆమోదం తెలుపుతారు. సదరు ప్రతిపాదనలను తిరస్కరించడం లేదా సవరణలు సూచించడం, యథావిధిగా ఆమోదం తెలిపే అధికారం జాయింట్‌ కలెక్టర్లకు ఉంటుంది.

Also Read : సినిమా టిక్కెట్లపై డివిజనల్‌ బెంచ్‌కు ఏపీ సర్కార్‌.. విచారణ రేపటికి వాయిదా..

Show comments