AP High Court, G.O 53 and 54 – ఏపీ సర్కార్‌ మరో నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు తోసిపుచ్చింది. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజులను క్రమబద్ధీకరిస్తూ.. భౌగోళిక ప్రాతిపదికన ఫీజులను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఫీజుల ఖరారు అంశంపై ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని, ఆ తర్వాత ఫీజులను ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది ఆగస్టు 24వ తేదీన రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజుల అంశానికి సంబంధించి ఏపీ సర్కార్‌ రెండు జీవోలను జారీ చేసింది. పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రైమరీ విద్యకు రూ.10 వేలు, సెకండరీ విద్యకు రూ.12 వేలు, మున్సిపాలిటీలలో ఉన్న పాఠశాలల్లో రూ.11 వేలు, రూ.15 వేల చొప్పన, కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న పాఠశాల్లో ప్రైమరీ విద్యకు రూ. 12 వేలు, సెకండరీ విద్యకు రూ.18 వేలు చొప్పన ఖరారు చేస్తూ జీవో నంబర్‌ 53ను జారీ చేసింది.

అదే రోజున జూనియర్‌ కాలేజీల్లోని వివిధ కోర్సుల ఫీజులను కూడా ఖరారు చేస్తూ మరో జీవో 54ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. పంచాయతీ పరిధిలోని జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ/బైపీసీ కోర్సులకు రూ.15 వేలు, ఇతర కోర్సులకు రూ.12 వేల రూపాయల చొప్పన నిర్ణయించింది. మున్సిపాలిటీలలోని జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ/బైపీసీ కోర్సులకు రూ.17,500, ఇతర కోర్సులకు రూ.15 వేలు చొప్పన, కార్పొరేషన్‌ పరిధిలోని జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ/బైపీసీ కోర్సులకు రూ.20 వేలు, ఇతర కోర్సులకు రూ. 18 వేలు చొప్పన ఖరారు చేసింది.

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు తమకు సమ్మతం కాదని, ఆ జీవోలను కొట్టివేయాలని ఆ పిటీషన్‌లో కోరాయి. అదే విధంగా ఫీజుల ఖరారు విషయంలో తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలన్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీ యాజమాన్యాల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏపీ హైకోర్టు.. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ఏపీలో తెరపైకి మరో పార్టీ..?

Show comments