YS Jagan, Pension Hike – జనవరి ఒకటో తేదీ.. ఏపీలో వారికి నిజమైన పండగ..

నూతన సంవత్సరంలో మొదటి రోజే ఏపీలోని వృద్ధులకు పండగ రోజు కానుంది. వృద్ధాప్య పింఛన్‌ 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించిన ఏపీ సర్కార్‌.. అందుకు అనుగుణంగా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్‌ పెంపుదల డిసెంబర్‌ నుంచి వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 1వ తేదీన పెంచిన మొత్తం 2,500 చొప్పన వృద్ధులకు పింఛన్‌ అందిస్తామని పేర్కొంది. తాజా పెంపుతో రాష్ట్ర ఖజానాపై 129 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపింది.

కొత్త పింఛన్లు కూడా..

జనవరి ఒకటో తేదీన పెంచిన పింఛన్‌ సొమ్ము అందించడమే కాదు.. పింఛన్‌ కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. కొత్త పింఛన్లకు ఆమోదం తెలిపింది. వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు సహా 12 కేటగిరీల్లో వైఎస్సార్‌ ఆసరా పేరుతో జగన్‌ సర్కార్‌ ప్రతి నెలా పింఛన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని జగన్‌ సర్కార్‌ అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో 1వ తేదీన కొత్తగా మరో 1.33 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 63.01 లక్షల పింఛన్లు..

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ మొత్తాన్ని 2 వేల రూపాయల నుంచి 2,250 రూపాయలకు పెంచారు. గత ప్రభుత్వం వృద్ధుల పింఛన్‌ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచగా.. తిరిగి జగన్‌ 60 ఏళ్లకు తగ్గించారు. కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 2020 జనవరిలో మంజూరు చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో పలుమార్లు నూతన పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 18,06,260 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. మొత్తంగా ప్రతి నెల జగన్‌ సర్కార్‌ 63.01 లక్షల పింఛన్లు ఇస్తోంది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛన్‌ సొమ్మును అందజేస్తూ.. వృద్ధుల మోముల్లో ఆనందాన్ని నింపుతోంది.

Also Read : కృష్ణాలోనూ మొదలైంది.. ఇక మిగిలింది ఏడు జిల్లాలే..

Show comments