Arjun Suravaram
Arjun Suravaram
సాధారణంగా మనుషులకు వృద్ధాశ్రమాలు అనేవి ఉంటాయి. జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డలను పెద్ద చేసిన తల్లిదండ్రులు..వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే వృద్ధాశ్రమాలు ఏర్పడ్డాయి. ఆ గృహాల్లో వృద్ధులు తమ చివరి దశను సాగిస్తుంటారు. అయితే ఇలా మనుషులకే కాక శునకాలకు సైతం వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. అయితే వీధి శునకాలకు కాకుండా.. పోలీస్ శాఖలో పని చేసిన జాగిలాలకు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వాటికి అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ హాయిగా ఉండేలా చూస్తున్నారు. ఈ ఆశ్రమాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో పోలీస్ శాఖ వారు నిర్మించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నేరస్థులు, ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు బాంబులను గుర్తించడంలో పోలీస్ జాగీలాలది కీలక పాత్ర. ఎన్నో సందర్భాల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నేరస్థులను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేస్తుంటాయి. అంతేకాక కొన్ని సందర్భాల్లో బాంబులను గుర్తించడంలో జాగీలాలు ప్రాణాలను సైతం కోల్పోయాయి. ఇలా సమాజ రక్షణలో జాగీలాలు అందించిన సేవలకు.. వాటికి ఎంత చేసిన తక్కువేనని మధ్యప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. సమాజం కోసం జీవితాలు అర్పించిన పోలీసు జాగిలాలు ఇప్పుడు… ఆ ఆశ్రమంలో ఎంతో హాయిగా విశ్రాంత జీవనం గడుపుతున్నాయి.
జీవితం అంతా సమాజం కోసం అంకింత చేసిన జాగీలాలను.. రిటైర్డ్ అయిన తరువాత ఈ వృద్ధాశ్రమంలోకి తరలిస్తున్నారు. ప్రత్యేకమైన వసతులతో.. అవి ఎంతో గౌరవంగా వృద్ధాప్య జీవితం గడిపేలా అక్కడి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వివిధ జాతులకు చెందిన 18 జాగిలాలు ఆ ఆశ్రమంలో ఉన్నాయి. వైద్యుల ఆధ్వర్యంలో వీటికి ఆరోగ్య పరీక్షలు కూడా జరుపుతున్నారు. వీటి కోసం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో 6 గదులు ఉన్నాయి. జాగిలాల కోసం పరుపులు, కూలర్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.
ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. జాగిలాలు సంగీతం వింటూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండేందుకు వాటిని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ఉన్న జాగిలాల్లో కొన్ని విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవి కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో గాయపడిన జాగిలాలకు వీలైనంత వరకు ఆ బాధ నుంచి ఉపశమనం కలిగేలా..నడక యంత్రాలను కూడా ఇక్కడి అధికారులు ఏర్పాటు చేశారు. మరి.. ఇలా శునకాల కోసం వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వారంలో పెళ్లి అనగా.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యువతి!