ఉక్రెయిన్‌కు అమెరికా యుద్ధ విమానాలు

ఎవరెన్ని చెప్పినా రష్యా చెవికెక్కడం లేదు. ఉక్రెయిన్‌పై భీకర దాడులను ఆపడంలేదు. ఉక్రెయిన్‌ కూడా రష్యా సేనలను ప్రతిఘటిస్తూనే ఉంది. ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడానికి పుతిన్‌ సేనలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు పోరాడుతోంది. మేరియుపోల్‌ ముట్టడికి చేరువైన రష్యా సైన్యం.. తక్షణమే ఆయుధాలు వీడాలని ఉక్రెయిన్‌ సైన్యానికి అల్టిమేటం జారీ చేసింది.

రెండో దశ యుద్ధం ప్రారంభమైంది అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ ప్రకటన జారీ చేశారు. కొద్ది గంటల్లోనే రష్యా మరో హెచ్చరిక చేసింది. ఆయుధాలు వీడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అయినా ఉక్రెయిన్‌ సైన్యం వెనక్కి తగ్గడం లేదు. ఆగ్రహించిన రష్యా.. బుధవారం విచక్షణా రహితంగా విరుచుకుపడింది. సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. డాన్‌బాస్‌ తీర ప్రాంతంలోనైతే 470 కిలోమీటర్ల పొడవునా దాడులు చేసింది. ఒక్క మేరియుపోల్‌లోనేగాక ఉక్రెయిన్‌లో ఉన్న సైన్యమంతా తక్షణమే లొంగిపోవాలని రష్యా హెచ్చరించింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవంది.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధ సాయాన్ని పెంచుతున్నాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు, విడిభాగాలను అందజేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఏ రకం, ఎన్ని విమానాలను పంపారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్‌ వద్ద రెండు వారాల క్రితం ఉన్న యుద్ధవిమానాలతో పోలిస్తే ప్రస్తుతం మరిన్ని విమానాలు ఉన్నాయని పెంటగాన్‌ తెలిపింది. ఇతర దేశాల నుంచి అందిన అదనపు సాయంతో వారి విమానాలు, ఆయుధాల సంఖ్య బాగా పెరిగిందని వెల్లడించింది. పూర్తిగా విమానాలు కాదని, విడిభాగాలను పంపామని పెంటగాన్‌ అధికార ప్రతినిధి కిర్బీ తెలిపారు.

అమెరికా మిలిటరీ సాయానికి సంబంధించిన తొలి షిప్‌మెంట్‌ ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకుందన్నారు. ఉక్రెయిన్‌కు మరో 800 వేల డాలర్ల విలువైన సైనిక సాయం అందించేందుకు అమెరికా సిద్ధమవుతోందని ఆ దేశ మీడియా తెలిపింది. రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందజేస్తామని అమెరికా, ఈయూ ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, రొమేనియా, పోలండ్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, యూరోపియన్‌ కమిషన్‌ నేతలతో వీడియో కాల్‌లో మాట్లాడారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.

Show comments