Aithe : నలుగురు కుర్రాళ్లతో థ్రిల్లింగ్ డ్రామా – Nostalgia

అసలు సినిమా అంటే ఒక ఫార్ములా ప్రకారమే నడవాలా. కొత్తగా ఆలోచిస్తే జనం ఆదరించరా. అవుట్ అఫ్ ది బాక్స్ థింకింగ్(పరిధిని మించి ఆలోచించడం)ని దర్శకులు అందిపుచ్చుకోలేరా. వీటికి సమాధానం మాటల రూపంలో కంటే ఒక మూవీగా చెప్పాల్సి వస్తే ఐతే కన్నా గొప్ప ఉదాహరణ మరొకటి అక్కర్లేదు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేసే అరుదైన టెక్నీషియన్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మొదటి చిత్రం ఇది. ఆ విశేషాలు చూద్దాం. లిటిల్ సోల్జర్స్ తీస్తున్న సమయంలో గుణ్ణం గంగరాజు దగ్గర అసిస్టెంట్ గా చేరారు యేలేటి. కారణం స్వయానా బంధువు కావడమే. అమృతం మొదటి పది ఎపిసోడ్లు తీసింది కూడా ఈయనే.

ఆ టైంలో రాసుకున్న కథే ఐతే. మార్కెట్ ఉన్న హీరోలెవరూ అవసరం లేకుండా కేవలం కొత్త ఆర్టిస్టులతో ఓ ప్రయోగం చేయాలనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు. వినగానే గంగరాజుకి బాగా నచ్చేసింది. బడ్జెట్ కోటిన్నర ఫిక్స్ చేసుకున్నారు. 2003లో ఇది చాలా తక్కువ మొత్తం. అప్పటికే తెలుగు మార్కెట్ బాగా పెరిగిపోయి ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాంటి టైంలో ఈ సాహసానికి పూనుకున్నారు. నలుగురు కుర్రాళ్ళు తమ జీవితంలో ఎదురైన ఆర్థిక కష్టాలను తీర్చుకోవడానికి ఒక పెద్ద మాఫియా డాన్ ని కిడ్నాప్ చేస్తారు. పోలీసులకు దొరక్కుండా చివరికి తమ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నారు అనేదే ఐతే కథ.

హిందీలో అప్పటికే సీనియర్ ఆర్టిస్ట్ గా పేరున్న పవన్ మల్హోత్రాను విలన్ గా ఎంచుకోవడంలోనే యేలేటి మార్కు కనిపిస్తుంది. కొందరు తప్పించి అందరూ కొత్తవాళ్లే ఉంటారు. మోహిత్ చద్దా, శశాంక్, అభిషేక్, జనార్దన్ లతో పాటు సింధు తులాని, హర్షవర్ధన్, శివాజీరాజా, అశోక్ కుమార్, నర్సింగ్ యాదవ్ తదితరులు ఇందులో భాగమయ్యారు. కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసింది ఒక్క పాటే అయినా చాలా కాలం యూత్ లో అది మారుమ్రోగిపోయింది. ఏ మాత్రం ఊహించలేని కథాకథనాలతో ఐతేని చూసి ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. లిమిటెడ్ రిలీజ్ లోనూ 6 కోట్ల రూపాయలు వసూలు చేయడం సెన్సేషన్. 2004 ఉత్తమ తెలుగు చిత్రం జాతీయ అవార్డు దక్కించుకుంది ఐతే. నాలుగు నంది పురస్కారాలు కూడా వచ్చాయి. న్యూ జెనరేషన్ మేకర్స్ మిస్ చేయకూడని సినిమా ఐతే

Also Read : Subhash Chandra Bose : పరాజయం పాలైన ఫ్రీడమ్ ఫైటర్ – Nostalgia

Show comments