1987 World Cup, Reliance Cup, NKP Salve – రెండు టికెట్ల కోసం పంతంతో క్రికెట్ ప్రపంచ కప్పును భారతదేశానికి తీసుకొచ్చిన బిసిసిఐ అధ్యక్షుడు

1975,1979,1983 సంవత్సరాలలో జరిగిన మొదటి మూడు క్రికెట్ ప్రపంచ కప్పులు ఇంగ్లాండులో జరిగితే, 1987లో జరిగిన మరో ప్రపంచ కప్ భారతదేశంలో జరగడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడి అహం దెబ్బతినడం కారణం అని నమ్మడానికి వింతగా ఉన్నా అది నిజం. ఆ అధ్యక్షుడు ఎన్ కే పి సాల్వే. ఆ సంఘటన జరిగింది 1983 కప్ ఫైనల్లో.

1983 ప్రపంచ కప్ ఆడడానికి కపిల్ దేవ్ నాయకత్వంలో ఇంగ్లాండు వెళ్లిన భారత క్రికెట్ జట్టు మీద క్రికెట్ విశ్లేషకులు, అభిమానుల్లోనే కాకుండా చాలా మంది జట్టు సభ్యులలో కూడా పెద్దగా ఆశలు లేవు. కొన్ని రోజుల ముందే పెళ్ళయిన ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పోటీల్లో లీగ్ దశ అయిపోగానే లండన్ నుంచి హనీమూన్ కోసం అమెరికా వెళ్లడానికి విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా భారత జట్టు లీగ్ దశ దాటడమే కాకుండా, తన ఆల్ రౌండ్ ప్రతిభతో సెమీ ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లాండు జట్టును ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది.

ఆ సమయంలో తన వ్యక్తిగత పనిమీద సతీసమేతంగా లండన్లో ఉన్నాడు అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి సిద్ధార్థ శంకర్ రే. భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్లో ఆడే అపురూప ఘట్టం స్టేడియంలో కూర్చుని వీక్షించాలనుకున్న రే రెండు టికెట్లు కావాలని లండన్లో ఉన్న తన మంత్రివర్గ సహచరుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు అయిన ఎన్ కే పి సాల్వేని కోరాడు. అదెంత పని అని భావించిన సాల్వే రెండు టికెట్లు కావాలని ఇంగ్లాండు క్రికెట్ బోర్డు అధికారులను కోరాడు. “మీకు ఇప్పటికే రెండు టికెట్లు ఇచ్చాం కదా. దాంతో సర్దుకోండి. అంతకు మించి ఒక్క టికెట్ కూడా ఇవ్వడం కుదరదు” అని వాళ్ళు సాల్వే మొహమ్మీద చెప్పారు. ఇది 1983 సంగతి. ఆ రోజుల్లో భారత క్రికెట్ బోర్డు దగ్గర ఇప్పుడు ఉన్నంత పరపతి కానీ, సంపద కానీ లేదు.

సాటి క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అడిగితే రెండు టికెట్లు ఇవ్వని ఇంగ్లాండు క్రికెట్ బోర్డు తన సభ్యులందరికీ కాంప్లిమెంటరీ టికెట్ల కోసం ఒక బాక్స్ మొత్తం కేటాయించింది. అయితే ఫైనల్లో ఇంగ్లాండు ఆడటం లేదు కాబట్టి ఆ టికెట్లు పొందిన చాలా మంది ఫైనల్ చూడాలనుకోకపోవడంతో ఆ బాక్స్ లో చాలా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఆ విషయాన్ని శంకర్ రే తేలిగ్గా తీసుకున్నా సాల్వే మాత్రం ఆ అవమానాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ఎలాగైనా 1987లో జరగబోయే నాలుగవ ప్రపంచ కప్ పోటీలను భారతదేశంలో జరిగేలా చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ఫైనల్లో భారత జట్టు గెలిచాక విజేతలకు ఇచ్చిన విందు సమయంలో సాల్వే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, పాకిస్తాన్ వాయుసేన ఛీఫ్ అయిన నూర్ ఖాన్ తో “వచ్చే ప్రపంచ కప్ ఇంగ్లాండులో కాకుండా ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో” అన్నాడు. “నిజమే” అన్నాడు నూర్ ఖాన్. “ఇండియా, పాకిస్తాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చేలా ప్రయత్నం చేద్దాం” అన్నాడు సాల్వే. ఆనందంగా ఆమోదం తెలిపాడు నూర్ ఖాన్. పక్కనే ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు కూడా ఆ ఆలోచనకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

మద్దతు తెలిపిన ఇందిరాగాంధీ

ప్రపంచ విజేతలుగా తిరిగి వచ్చిన భారత జట్టుకి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ విందు ఇచ్చారు. ఆ సమయంలో తనకెదురైన అనుభవం ఆమెతో చెప్పి, ప్రపంచ కప్పుని భారతదేశానికి తీసుకురావాలని తను చేస్తున్న ప్రయత్నాలను వివరించాడు సాల్వే. “సరే మీరు ఆ పనిలో ఉండండి. అందుకవసరమైన నిధుల సంగతి నేను చూసుకుంటాను” అని హామీ ఇచ్చారు ఇందిర. ప్రపంచ కప్ నిర్వహించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ఆమెకు కనిపించిన వ్యక్తి రిలయన్స్ సంస్థ అధినేత ధీరూభాయ్ అంబానీ. తనను కలవమని సందేశం పంపారు ఆమె. అంబానీ తన వ్యాపార ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్నది ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.

మరుసటి రోజే వచ్చి తనను కలిసిన ధీరూభాయ్ తో, “ప్రపంచ కప్ మన దేశానికి వస్తే అందుకయ్యే ఖర్చులు మీరు భరించగలరా?” అనడిగింది. “మీరు కప్ తీసుకురండి మేడమ్. నేను మీకు బ్లాంక్ చెక్ ఇస్తాను” అన్నాడు ధీరూభాయ్ వినయంగా. కప్ నిర్వహణకు అవసరమైన నిధులు కూడా సమకూరడంతో సాల్వే తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. రొటేషన్ పద్ధతిలో ప్రపంచ కప్ నిర్వహించాలని, 1987లో ఇండియాలో, 1991లో ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ జరగాలని ప్రతిపాదన ఐసిసి ముందు పెట్టి, ఐసిసి ఇంగ్లాండుతో సహా మరో పెద్ద సభ్యదేశం అయిన ఆస్ట్రేలియా మద్దతు కూడగట్టుకున్నాడు.

సభ్యదేశాల మద్దతు కోసం ప్రయత్నాలు

తమ ప్రతిపాదన మీద ఓటింగ్ జరిగేనాటికి వీలయినన్ని ఎక్కువ సభ్యదేశాల మద్దతు సంపాదించాలని దృష్టి సారించాడు సాల్వే. అప్పటికి ఐసిసిలో ఎనిమిది పూర్తి స్థాయి, టెస్టు క్రికెట్ ఆడే దేశాలు సభ్యులుగా ఉంటే, ఇరవై ఒక్క దేశాలు అసోసియేట్ సభ్యులుగా ఉన్నాయి. పూర్తి స్థాయి సభ్యులకు ఓటింగ్ ప్రక్రియలో ఒక్కో దేశానికి రెండు ఓట్లు ఉంటే, అసోసియేట్ సభ్యులకు ఒక్కో ఓటు చొప్పున మొత్తం ముప్పై ఏడు ఓట్లు ఉన్నాయి. ఐసిసి తన నిధుల్లో అరవై శాతం ఎనిమిది పూర్తి స్థాయి సభ్యదేశాల మీద ఖర్చు చేస్తూ, ఇరవైఒక్క అసోసియేట్ సభ్యదేశాల మీద నలభై శాతం మాత్రమే ఖర్చు చేసేది.

ఇరవై ఒక్క దేశాల నుంచి ప్రపంచ కప్పులో ఆడడానికి ఒక దేశాన్ని ఎంపిక చేయడానికి నిర్వహించే పోటీలో పాల్గొన్నందుకు ఒక్కో జట్టుకు అప్పటివరకూ ఇంగ్లాండు ఇస్తున్న అయిదువేల పౌండ్లని ఇరవై వేల పౌండ్లు చేస్తామని వాగ్దానం చేశాడు సాల్వే. అలాగే పూర్తి స్థాయి సభ్యదేశాలకు పదిహేనువేల పౌండ్లని అయిదురెట్లు పెంచి డెభ్బై అయిదువేల పౌండ్లు ఇస్తామని చెప్పాడు. దీంతో ఓటింగ్ పెట్టినప్పుడు భారత, పాకిస్తాన్ జట్ల ప్రతిపాదనకు అనుకూలంగా పదహారు ఓట్లు, వ్యతిరేకంగా పన్నెండు ఓట్లు వచ్చాయి.

అడుగడుగునా అడ్డంకులు

ఓటింగ్ లో ఓడిపోయినా ఇంగ్లాండు భారత, పాకిస్తాన్ దేశాలలో ప్రపంచ కప్ జరగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. అప్పట్లో వర్ణవివక్ష కారణంగా దక్షిణాఫ్రికా జట్టు క్రీడాపోటీలలో పాల్గొనకుండా నిషేధం ఉండేది. అయితే చాలా మంది దక్షిణాఫ్రికా క్రీడాకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ఆయా దేశాల తరపున ఆడేవారు. ఇలాంటి వారిని ఆడనిస్తారా, నిషేధిస్తారా అని భారత ప్రతినిధులకు ప్రశ్న సంధించింది ఇంగ్లాండు తరపున ఐసిసి. నిషేధిస్తామంటే దక్షిణాఫ్రికాలో పుట్టిన క్రీడాకారులు ఉన్న ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అభ్యంతరం చెప్తాయి. నిషేధం విధించే ఆలోచన లేదు అంటే వెస్టిండీస్ జట్టు అభ్యంతరం చెప్పడంతో పాటు, అది భారతదేశ విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ చిక్కుముడిని కర్రా విరగదు, పాము చావదు అన్న రీతిలో పరిష్కరించాడు సాల్వే. దక్షిణాఫ్రికాలో జన్మించిన క్రికెటర్ల మీద భారతదేశం నిషేధం విధిస్తుంది కానీ ఆ నిషేధం ప్రపంచ కప్ ముగిసిన సంవత్సరం తర్వాత కానీ అమల్లోకి రాదు అని భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అప్పటివరకూ వన్డే మ్యాచులలో ఒక్కో ఇన్నింగ్స్ అరవై ఓవర్లు ఉండేది. భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కో ఇన్నింగ్స్ అరవై ఓవర్లు ఆడాలంటే ఆటగాళ్లు ఇబ్బంది పడతారని మరో వాదన తెరపైకి తీసుకొచ్చారు. అప్పటికే అరవై ఓవర్లు ఒకో ఇన్నింగ్స్ చూడ్డానికి ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని ఒక వాదన ఉండడంతో ఒకో ఇన్నింగ్స్ యాభై ఓవర్లకు తగ్గించాలని సాల్వే నాయకత్వంలోని ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ చేసిన ప్రతిపాదనకు ఐసిసిలోని అన్ని సభ్యదేశాలు మద్దతు తెలిపాయి.

ప్రపంచ కప్పులో భాగంగా జరిగే అన్ని మ్యాచులూ రికార్డు చేసి, ప్రత్యక్ష ప్రసారం చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకూ అందించవలసిన భారత టెలివిజన్ సంస్థ దూరదర్శన్ పాత టెక్నాలజీని ఇంకా వాడుతూ ఉంది కాబట్టి అది అందించే సిగ్నల్ నాణ్యత మీద అనుమానాలు లేవదీసింది ఇంగ్లాండు. ముప్పై కోట్లు పెట్టి దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం సమూలంగా ఆధునీకరిస్తామని దాన్ని తిప్పికొట్టాడు సాల్వే. విశాలమైన భారత దేశంలో మ్యాచ్ లు జరిగే వేదికల మధ్య ఎనిమిది జట్ల ఆటగాళ్లు, అధికారుల రవాణా కష్టం అవుతుందన్న వాదనకి ఇండియన్ ఎయిర్ లైన్స్ తన టైమ్ టేబుల్ ని ప్రపంచ కప్ షెడ్యూలుకి అనుగుణంగా మార్చడం ద్వారా సమాధానం చెప్పింది.

1987 సంవత్సరం మొదట్లో కూడా భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత సాకుగా చూపించి ప్రపంచ కప్ నిర్వహణ అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇంగ్లాండు. అప్పుడు పంజాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఐ ఎస్ బింద్రా పాకిస్తాన్ వెళ్లి అధ్యక్షుడు జియా ఉల్ హక్ ని భారత పర్యటనకు ఆహ్వానించాడు. జియా ఉల్ హక్ పట్ల అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీకి సదభిప్రాయం లేకపోయినా విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని ఆయన గౌరవార్థం , విందు ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు సరిహద్దులో మోహరించిన బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.

ఇలా ఒక్కో అడ్డంకినీ తొలగించుకుంటూ 1987 అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 వరకూ ఎనిమిది జట్ల మధ్య 27 మ్యాచులు విజయవంతంగా నిర్వహించింది భారత, పాకిస్తాన్ సభ్యులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ. భారత, పాకిస్తాన్ జట్లు రెండూ సెమీ ఫైనల్స్ చేరీనా, ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్, ఇంగ్లాండు చేతిలో ఇండియా ఓడిపోయి, ఇండియా, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడితే చూడాలనుకున్న క్రికెట్ అభిమానుల ఆశలు వమ్ము అయ్యాయి. ఫైనల్లో ఇంగ్లాండు మీద విజయం సాధించిన అలాన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్ గా నిలిచింది.

రికార్డు సృష్టించిన ప్రపంచ కప్

టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా, స్టేడియంలో టికెట్ అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించింది రిలయన్స్ కప్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది టీవీలో ఈ పోటీలను తిలకిస్తే, అనేక మంది స్టేడియంలో కూర్చుని తిలకించారు. 1983 లో జరిగిన ప్రపంచ కప్పులో మొత్తం ఇరవై ఏడు మ్యాచులను, సగటున ఒక్కో మ్యాచ్ కి తొమ్మిదిన్నర వేల చొప్పున రెండు లక్షల ముప్పై వేల మంది చూస్తే, నవంబర్ 8 1987న కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఒక్కదానికే తొంభై అయిదు వేల మంది హాజరయ్యారు.

1987 ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ఠ క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో ఆర్థిక సంస్కరణలలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో అడుగుపెట్టడంతో స్పాన్సర్ షిప్ ద్వారా భారత క్రికెట్ బోర్డు బాగా సంపాదించి ఆ తర్వాత కాలంలో ప్రపంచ క్రికెట్ ని శాసించే స్థాయికి ఎదిగింది.

Show comments