Nidhan
Meena, Meena Biography, Meena Birthday Special Story: సీనియర్ హీరోయిన్ మీనా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 48వ పడిలోకి ఆమె అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె సినీ కెరీర్, జీవిత విశేషాలను తెలుసుకుందాం..
Meena, Meena Biography, Meena Birthday Special Story: సీనియర్ హీరోయిన్ మీనా ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 48వ పడిలోకి ఆమె అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె సినీ కెరీర్, జీవిత విశేషాలను తెలుసుకుందాం..
Nidhan
సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని, ఇక్కడ తమ ప్రతిభ చాటుకొని క్రేజ్, గుర్తింపు సంపాదించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయితే ఈ డ్రీమ్ నెరవేరడం అంత ఈజీ కాదు. ఒకవేళ కష్టపడి అక్కడి దాకా వచ్చి సక్సెస్ అయినా దాన్ని నిలబెట్టుకోలేక రేసులో వెనుకబడిపోతారు. చిన్న ఫెయిల్యూర్స్‌కు తలొంచేస్తారు. కానీ కొందరు మాత్రం సినిమాలే జీవితంగా బతుకుతుంటారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా తమ ప్రయాణాన్ని ఆపరు. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయాలి, వాళ్ల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాలనే ఆశతో మజిలీతో సంబంధం లేకుండా జర్నీ చేస్తూనే ఉంటారు. అలాంటి అరుదైన వారిలో సీనియర్ హీరోయిన్ మీనా ఒకరు. బాల నటిగా ఐదేళ్ల ప్రాయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇంకా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆ అందాల తార.. 48వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఆమె బర్త్ డే స్పెషల్‌గా ఈ స్టోరీ మీ కోసమే..
మీనా పుట్టింది, పెరిగింది అంతా.. తమిళనాడు రాజధాని చెన్నైలోనే. 1976 సెప్టెంబర్ 16న ఆమె జన్మించారు. ఆమె తండ్రి పేరు దురైరాజ్. ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ఆమె తల్లి రాజామల్లిక. మీనా తల్లి అలనాటి సినీ నటిగా పేరు పొందారు. దురైరాజ్-రాజామల్లికకు మీనా ఒక్కతే సంతానం. 8వ తరగతి వరకు చెన్నైలోనే చదువుకున్నారు మీనా. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోవడంతో స్కూల్ మానేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడితో ఆమె ఎడ్యుకేషన్ అయిపోలేదు. చదవడం అంటే ఎంతో ఇష్టం ఉన్న మీనా.. ఆ తర్వాత ప్రైవేట్‌లో టెన్త్ పాస్ అయ్యారు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేశారు.
ఇండస్ట్రీలోకి ఒక్క ఛాన్స్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు నటులు. ఏళ్లకు ఏళ్లు ట్రై చేసినా అవకాశాలు రాక వెనుదిరిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ మీనా అలా కాదు. ఆమె ఐదేళ్ల వయసులో బుడిబుడి అడుగులు వేసేటప్పుడే తెరంగేట్రం చేశారు. ‘నెంజాంగల్’ అనే తమిళ చిత్రంతో ఫిల్మ్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 1982 నుంచి 1986 వరకు బాలనటిగా ఎన్నో చిత్రాల్లో అలరించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ మూవీస్‌లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశారు. ‘శ్రీపురం మొనగాడు’, ‘ఇల్లాలు ప్రియురాలు’, ‘బావా మరదళ్లు’, ‘కోడె త్రాచు’, రెండు రెళ్ల ఆరు’, ‘ఖూనీ’ లాంటి టాలీవుడ్ మూవీస్‌లో తన క్యూట్ యాక్టింగ్‌తో అందరి మనసులు గెలుచుకున్నారు. విజయశాంతి బ్లాక్‌బస్టర్ హిట్ ‘కర్తవ్యం’లోనూ చిన్న క్యారెక్టర్ చేశారామె.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాన్నాళ్లు అలరించిన మీనా కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. 1990లో ‘ఒరు పుదియా కధై’ చిత్రంతో ఆమె కథానాయికగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రభు దాస్ సరసన నటించిన ఆమె.. తన యాక్టింగ్, లుక్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే మీనాకు అసలు బ్రేక్ వచ్చింది మాత్రం అదే ఏడాది తెలుగులో నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతోనే అని చెప్పాలి. ఇక్కడితో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చలాకీ నటన, అందం ఆమెకు బిగ్ ప్లస్ అయ్యాయి. 90వ దశకంలో సౌత్‌లోని అన్ని భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ హవా నడిపించారు మీనా. చిరంజీవి, రజినీకాంత్, వెంకటేశ్, కమల్‌హాసన్‌తో నటించి స్టార్డమ్ దక్కించుకున్నారు. ‘ముత్తు’, ‘ముఠామేస్త్రి’ లాంటి సూపర్ హిట్స్‌తో ఆమె పేరు మార్మోగింది.
తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించినా మీనాకు తెలుగులో దక్కిన క్రేజ్, గుర్తింపు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇక్కడి ప్రేక్షకులు ఆమెను ఎంతో ఆదరించారు. మన ఇంటి అమ్మాయే అనేంతగా అందరి హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. వెంకటేశ్ సరసన నటించిన ‘చంటి’ మూవీ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అందులో ఆమె నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన ‘స్నేహం కోసం’, ‘సూర్యవంశం’, ‘సింహాచలం’, ‘మా అన్నయ్య’, ‘బొబ్బిలి వంశం’ చిత్రాలు మీనాను ఇక్కడ టాప్ హీరోయిన్ను చేశాయి. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్లో మీనా తన నటనతో ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్నారు. రాజేశ్వరి కల్యాణం, సీతారామయ్య గారి మనవరాలు చిత్రాలకు ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
మీనా యాక్టింగ్‌లోనే కాదు.. సింగింగ్, డబ్బింగ్లోనూ తోపే. ఆ టాలెంట్‌తో ప్లేబ్యాక్ సింగర్‌గా కొన్ని సినిమాలకు ఆమె సాంగ్స్ కూడా పాడారు. అలాగే చిన్న పిల్ల లాంటి వాయిస్‌తో ఆకట్టుకునే ఈ నటి.. కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ కూడా చెప్పడం మరో విశేషం. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఏది పడితే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా సెలెక్టివ్‌గా ఉంటున్నారు. తన పాత్రతో పాటు కథ నచ్చితేనే ఎస్ చెబుతున్నారు.
మీనా కెరీర్లో బిజీగా ఉన్న టైమ్‌లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆమె పెళ్లాడారు. 12 జులై, 2009లో వీళ్ల మ్యారేజ్ జరిగింది. వీళ్లకు నైనిక అనే పాప పుట్టింది. నైనిక తల్లికి తగ్గ తనయ అనే చెప్పాలి. 5 ఏళ్ల వయసులోనే కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మూవీ ‘తెరి’లో నైనిక యాక్ట్ చేసింది. ఆ సినిమాలో క్యూట్ యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసింది.
ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్‌లో నటిస్తూ హాయిగా జీవిస్తున్న మీనా లైఫ్‌లో ఊహించని విషాదం నెలకొంది. ఆమె భర్త విద్యాసాగర్ 28 జూన్, 2022న మృతి చెందారు. కరోనా వచ్చాక ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు విద్యాసాగర్. ట్రీట్మెంట్ చేయించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో చనిపోయారు. దీంతో మీనా ఒంటరి అయిపోయారు. అయితే పెంచి పెద్ద చేసిన తండ్రి మృతి చెందినప్పుడు ఎలాగైతే నిలబడ్డారో.. భర్త మరణాన్ని తట్టుకొని కూడా ఆమె అలాగే ఫైట్ చేస్తున్నారు. తండ్రి లేని లోటు తెలియకుండా కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. జడ్జిగా పలు షోలు చేస్తూనే.. యాక్టింగ్ కెరీర్‌ను కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ‘రౌడీ బేబీ’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. విషాదాలకు వెరవకుండా పోరాడుతూ సినిమాలే జీవితంగా బతుకుతున్న ఈ యోధురాలికి సెల్యూట్.