Kalki 2898 AD: కల్కిలో చూపించిన శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారంటే..!

కల్కి చిత్రం చూపించిన దగ్గర నుంచి జనాలు కల్కి అవతారం, శంబల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటి వరకు ఎవరైనా అక్కడకు వెళ్లారా అంటే..

కల్కి చిత్రం చూపించిన దగ్గర నుంచి జనాలు కల్కి అవతారం, శంబల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో శంబల నగరం ఎక్కడుంది.. ఇప్పటి వరకు ఎవరైనా అక్కడకు వెళ్లారా అంటే..

ప్రభాస్‌ నటించిన కల్కి చిత్రం దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాపై మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు.. మూవీపై అంచనాలు ఆకాశానికి తీసుకెళ్లాయి. ఇక కల్కి సినిమా గురించి నాగ్‌ అశ్విన్‌ ఇంటర్వ్యూలు, ట్రైలర్‌లు విడుదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు శంబల. మరి నిజంగానే ఈ నగరం ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది.. ఇప్పటి వరకు ఎవరైనా శంబలకు వెళ్లారా.. దీని గురించి పురణాలు, వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీ కోసం..

హిందూ పురణాల ప్రకారం విష్ణువు దశవతారాల్లో కల్కి చివరి అవతారం. దీని ఆధారంగా తెరకెక్కుతన్న చిత్రం కల్కి 2898 ఏడీ. కల్కి జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల. మరి ఈ స్థలం ప్రత్యేకత ఏంటి అంటే.. ఇది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతమే శంబల. ఇది హిమాలయాల్లోని అంతుచిక్కని ప్రదేశం. శంబల సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. ఇక హిందూ పురాణాల్లో శంబలను సిద్ధాశ్రమం, భూలోక త్రివిష్టపం(భూలోక స్వర్గం) అని పిలుస్తారు. ఇది కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబల ఉంది అంటారు.

శంబలకు దారిదే..

పురాణాలు, కొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం.. ఎవరెస్ట్‌ అడుగున ఓ సొరంగం మార్గం ఉంది. దాని గుండా వెళ్తే.. గడ్డకట్టిన మంచునది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. దానిలో ఓ గుహ వస్తుంది. ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు అని చెబుతారు. వారిని దాటుకుని వెళ్తే.. మంచుకొండల మధ్యన స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబల అంటారు. టిబెటన్లు.. శంబలను ఇప్పటికీ మహిమాన్విత ప్రాంతంగా విశ్వసిస్తారు.

అలానే 13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో ఎన్నో రహస్య విషయాలు ఉన్నాయి. వీటిలో శంబలకు వెళ్లే దారి అనే పేరుతో తాషీలామా ఓ గ్రంథాన్ని రచించారు. దీనిలో శంబలకు వెళ్లే దారి గురించి ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలలో వయసుని స్తంభింపజేసి నిత్యయవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయని.. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాషీలామా రాసిన గ్రంథంలో చెప్పుకొచ్చారు.

ఇప్పటి వరకు ఎవరైనా శంబలకు వెళ్లారా..

1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ.. వెళ్లారు. ఈక్రమంలో వీరు తమ ప్రయాణంలో.. హిమాలయాల్లో చూసిన వింతలన్నింటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఇది అప్పట్లో.. పెను సంచలనం సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలా మంది శంబలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంబల గురించి ప్రపంచానికి మొదట తెలియజేసిన వ్యక్తి నికోలస్‌ రోయిచ్‌. రష్యన్‌ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్‌, తత్వవేత్త అయిన నికోలస్‌ రోయిచ్‌.. రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంబల గురించి ఎక్కువ వివరాలు తెలిశాయి.

భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడైన రోయిచ్‌.. కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోయిచ్‌ మరణం తర్వాతే శంబలకు సంబంధించిన రహాస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్‌ ఎగ్జిబిషన్లో.. ఈ వివరాలన్నీ ఉన్నాయి. రోయిచ్‌ శంబలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని.. ఆయన గీసిన బొమ్మల్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే.. శంబలకు వెళ్లే దారి తెలుస్తుందని అంటారు.

ఇక రోయిచ్‌ రాసిన పుసక్తంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలించడమే కాక.. ఈ జీవశిల దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని.. సరిగ్గా కల్కి జన్మించడానికి ముందు శంబలకు చేరుకుంటాడని రోయిచ్‌ తన రచనల్లో చెప్పుకొచ్చాడు. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తుంది.

శంబలపై హిట్లర్‌కు ఆసక్తి..

శంబల గురించి రోయిచ్‌ రాసిన పుస్తకాలు, గీసిన బొమ్మలను చూసిన తర్వాత శంబలపై నియంత హిట్లర్‌కు ఆసక్తి పెరిగింది. అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని భావించిన హిట్లర్‌.. తన గూఢచారులను పంపించాడు. కానీ శంబల గురించి ఎలాంటి రహస్యం తెలుసుకోలేకపోయాడు. ఇక 1889వ శతాబ్ధంలో జన్మించిన సన్యాసిని ఆనందమయి హిమాలయాల్లో 20 అడుగుల ఎత్తున్న వారినిచూశానని చెప్పుకొచ్చారు. వారంతా ద్వాపరయుగానికి చెందిన వారు అంటారు. అలానే రష్యాకు చెందిన హెలీనా అనే సాహసి కూడా తను రాసిన పుసక్తాల్లో శంబల గురించి ప్రస్తావించారు. ఇక భాగవత చివరి స్కంధంలో కల్కి అవతారం, శంబల నగం గురించి, ధర్మ సంస్థాపన గురించి రాసుకొచ్చారు.

అయితే ఇప్పటికైతే శంబల ఇంకా మాయా నగరంగానే ఉంది. కల్కి లాంటి అవతారపురుషుడు జన్మించేబోయే భూలోక స్వర్గం లాంటి శంబలను చూడాలంటే.. పరిపూర్ణమైన మనసు.. యోగశక్తి, దైవబలం ఉండాలి అంటారు పండితులు. అలానే కల్కి ఈ భూమ్మీద జన్మించే వరకు ఈ నగరం.. మాయా నగరంగానే ఉంటుందని చెబుతున్నారు.

Show comments