Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తరచుగా తన జీవితంలో చోటుచేసుకునే సంఘటనలను బ్లాగ్ రూపంలో తెలియచేస్తూ ఉంటారు. అమితాబ్ తనను బాగా ఎమోషన్‌కు గురి చేసిన ఓ సంఘటన గురించి తన బ్లాగులో రాసుకొచ్చారు. ఆ సంఘటన గురించి చెబుతూ తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆయన తన బ్లాగులో ఈ విధంగా రాసుకొచ్చారు.. ‘‘ నేను కారులో రోడ్డుపై వెళుతూ ఉన్నాను.
అప్పుడు బాగా వర్షం పడుతోంది. ఓ చోట సిగ్నల్ పడటంతో నా కారు ఆపాను. అక్కడికి దగ్గరలో.. రోడ్డుపక్క ఓ చిన్నారి చేతిలో మల్లెపువ్వులు పట్టుకుని, వర్షంలో తుడుస్తూ అమ్ముతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత బాలిక నా కారు అద్దం దగ్గరకు వచ్చి నిలబడింది. అమాయకంగా నన్నే చూస్తూ ఉంది. నేను కారు అద్దం కిందకి దించి ‘ఏం కావాలి?’ అని అడిగాను. ఆమె మాత్రం ఏమీ మాట్లాడకుండా పూవులు చూపిస్తూ అలాగే నిలబడింది. నేను నాకా పూవులు కావాలని, ఎంత అని అడిగాను. ఆ పాప ఓ మూర తీసి ఇవ్వబోయింది. నేను మొత్తం కావాలి అని అన్నాను.
తను ఆశ్చర్యపోయి నా వైపు చూస్తూ నిలబడింది. తర్వాత పూలు మొత్తం 500 అని చెప్పింది. అప్పుడు ఆ పాప చూసిన చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు పూవులు కొంటానా? లేనా అని నావైపు చూస్తూ ఉంది. నేనా పూవులు తీసుకుని నా పాకెట్‌లో ఉన్న డబ్బులు తీసి ఇచ్చాను. అది ఎంత అమౌంటో కూడా నాకు తెలీదు. 4000-5000 రూపాయలు ఉండొచ్చు. ఆ డబ్బు చిన్నారికి ఇచ్చి.. ఆమె ముఖంలో ఆనందం చూద్దాం అనేలోపు గ్రీన్ సిగ్నల్ పడింది. నేను అక్కడినుంచి వెళ్లక తప్పలేదు. ఇప్పుడు ఆ సంఘటన గురించి రాస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి’’ అని అన్నారు. మరి, అమితాబ్‌ను కన్నీళ్లు పెట్టించిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.