iDreamPost

ఆశలన్నీ అడియాసలు.. అల్లు అర్జున్ మామకు దక్కని టికెట్!

  • Author singhj Published - 06:41 PM, Mon - 21 August 23
  • Author singhj Published - 06:41 PM, Mon - 21 August 23
ఆశలన్నీ అడియాసలు.. అల్లు అర్జున్ మామకు దక్కని టికెట్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖాన్ని పూరించారు గులాబీ బాస్, సీఎం కేసీఆర్. ఈ సంవత్సరం ఆఖర్లో జరగనున్న ఎలక్షన్స్​కు అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల జాబితా తయారీలో తలమునకలై ఉన్నాయి. అయితే ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇస్తూ అందరికంటే ముందే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు కేసీఆర్. ఏకంగా 115 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత తాజాగా ప్రకటించారు. అయితే ముందు నుంచి చెబుతూ వస్తున్నట్లే.. ఏడు చోట్ల తప్పితే మిగతా అన్ని స్థానాల్లో సిట్టింగ్​లకే మళ్లీ పోటీచేసే అవకాశం ఇచ్చారు కేసీఆర్.

కొత్త లిస్టులో నాలుగు చోట్ల మాత్రం అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగులో ఉంచారు కేసీఆర్. అయితే ఈ జాబితాలో కొన్ని స్థానాల్లో ఈసారి తమకే సీటు పక్కా అని ముందు నుంచి ప్రచారం చేసుకున్న ఆశావహులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. అందులో ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి. ఈ స్థానం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్​ ఎమ్మెల్యేగా పోటీచేసిన చంద్రశేఖర్​ రెడ్డి.. ఈసారి సాగర్ నుంచి బరిలోకి దిగాలని ఆసక్తి చూపిస్తూ వచ్చారు.

విద్యావేత్తగా మంచి పేరు గడించిన కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి తనకు సాగర్​లో పట్టు ఉందని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశారు. అల్లుడైన అల్లు అర్జున్ సినీ గ్లామర్ కూడా తనకు కలిసొస్తుందని పార్టీ నాయకత్వానికి తెలిపే ప్రయత్నం చేశారు. తన స్వగ్రామానికి దగ్గర్లో నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్​ను పిలిపించి హడావుడి చేశారాయన. ఎలక్షన్ క్యాంపెయిన్​లోనూ బన్నీ పాల్గొంటారని చెప్పుకొచ్చారు. కానీ కంచర్ల పోటీ చేద్దామనుకున్న స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్​కే కేసీఆర్ మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. దీంతో టికెట్ కోసం ఎంతగానో ప్రయత్నించిన కంచర్ల నీరుగారిపోయినట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ రాకపోవడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి